కేంద్రంలో వరుసగా మూడోసారి బీజేపీ అధికారంలోకి రాకుండా నిలువరించేందుకు, 28 ప్రతిపక్ష పార్టీలు కలిసి పది నెలల క్రితం పాట్నాలో భారత కూటమికి పునాది వేశాయి. తొలుత కూటమిలో పార్టీలు ఉత్సాహంగా కనిపించాయి. అయితే ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ కూటమిలో పార్టీలు బయటకు రావడం ప్రారంభించాయి. దీంతో కూటమి బలం తగ్గిపోతోంది. కాంగ్రెస్ బలహీన పడుతోంది .. ఆ విశేషాలేమిటో ఈ స్టోరీ ద్వారా తెలుసు కుందాం.
కొన్ని పార్టీలు కూటమిలో ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఎన్నికల తర్వాత పొత్తుల గురించి ఆలోచిద్దామనే భావనలో తృణమూల్ పార్టీ ఉంది.సొంతంగా లోకసభ అభ్యర్థులను ప్రకటించేసింది.ఇండియా కూటమిలో బలమైన పార్టీగా ఉన్న జేడీయూ నేత నితీష్ కుమార్ ఇండియా కూటమితో బంధాన్ని తెంచుకుని ఎన్డిఎలో చేరిపోయారు. ఓ రకంగా కాంగ్రెస్కు ఇది పెద్ద షాక్ అని చెప్పుకోవాలి. సీట్ల పంపకాల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే ఇండియా కూటమిలో మిత్రపక్షాలు ఒకదాని తర్వాత ఒకటి కూటమిని విడిచిపెట్టి వెళ్లడం ప్రారంభించాయి. ఇది ఖచ్చితంగా కూటమికి మైనస్ పాయింటే .
RLD కూడా ఇండియా కూటమి నుండి విడిపోయి BJP నేతృత్వంలోని NDA శిబిరంలో చేరింది. జేడీయూ-ఆర్ఎల్డీ అకస్మాత్తుగా ఎన్డీయేలో చేరడం ప్రతిపక్ష కూటమికి పెద్ద దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జమ్మూ కాశ్మీర్లో మెహబూబా ముఫ్తీ పార్టీ పీడీపీ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నది . సీట్ల పంపకం విషయంలో ఉత్తరప్రదేశ్లో ఎస్పీ, బీహార్లో ఆర్జేడీ పెట్టిన షరతులకు కాంగ్రెస్ అంగీకరించాల్సి వచ్చింది. 80 సీట్లు ఉన్న యూపీలో కాంగ్రెస్ 17 సీట్లలోనే పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. యూపీలో పార్టీ బలోపేతానికి ఏమాత్రం కాంగ్రెస్ నేతలు కృషి చేయలేదు.ఫలితంగా అగ్రనేతలు సొంత నియోజకవర్గాలను వదిలి వేరే రాష్ట్రానికి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఇండి కూటమిలో ఎన్నో చర్చల తర్వాత ఆప్తో సీట్ల సర్దుబాటు జరిగింది. అయితే ఢిల్లీ-గుజరాత్-హర్యానాలో మాత్రమే కాంగ్రెస్, ఆప్ మధ్య ఒప్పందం కుదిరింది, పంజాబ్లో ఈ రెండు పార్టీలు ఒకరిపై మరొకరు పోటీ చేస్తున్నారు. జార్ఖండ్ లో కూడా ఇండియా కూటమి ఇబ్బందులు పడుతోంది ..ఒక్క తమిళనాడులో తప్ప ఇండియా కూటమిలో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా తయారైందనే చర్చ నడుస్తోంది. ఇక ఏపీలో కాంగ్రెస్ ప్రభావమే లేదు. తెలంగాణ లో కొన్ని సీట్లు గెలవచ్చు .. ఈ పరిణామాల నేపథ్యంలో లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండబోతుందో చూడాలి మరి.
Discussion about this post