పేరు గొప్ప ఊరు దిబ్బ’ అనే సామెత ను ఎవరు పుట్టించారో కానీ ఆ సామెత డ్రాగన్ కంట్రీ చైనాకు నూటికి నూరు శాతం వర్తిస్తుందని చెప్పుకోవచ్చు. ఒక జలపాతం విషయంలో ఆ దేశం వ్యవహరించిన విధానంతో ఉన్న పరువంతా ఊడ్చుకుపోయింది. ఆ జలపాతం కథేమిటో ఇపుడు తెలుసుకుందాం.
ఇంతకూ ఆ జలపాతం పేరు ‘యుంటాయ్ వాటర్‌ఫాల్’ ఇది ఆసియాలోనే అతిపెద్ద జలపాతంగా రికార్డులకెక్కింది.హెనాన్ ప్రావిన్స్‌లోని యుంటాయ్ పర్వతాల నడుమ 1,030 అడుగుల ఎత్తు నుంచి నీరు కిందకు ప్రవహిస్తుంది. ఇన్నాళ్లూ ఇదొక ప్రకృతి సౌందర్యమంటూ ఆ దేశం కలరింగ్ ఇస్తూ వచ్చింది. తీరా చూస్తే.. ఇదంతా ఫేక్ అని, ఆ జలపాతం ఉత్తిదేనని తేలిపోయింది.
అది ఎలా అంటే …. ఆ దేశానికి చెందిన ఓ పర్యాటకుడు ఈ రహస్యాన్ని బట్టబయలు చేశాడు.ఇటీవల ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి.. యుంటాయ్ జలపాతం వద్ద ట్రెక్కింగ్‌కు వెళ్లాడు. ఈ క్రమంలోనే అక్కడి నుంచి ప్రకృతి దృశ్యాలను కనులారా వీక్షించాలని నిర్ణయించి.. పైకి ఎక్కారు. తీరా ఆ కొండపైకి ఎక్కాగా అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. ఈ యుంటాక్ జలపాతం సహజసిద్ధమైంది కాదని, కొండపైన పైపులను అమర్చి నీటిని కిందకు వదులుతున్నారని తేటతెల్లమైంది.
ఈ క్రమంలో ఆ పర్యాటకుడు ఇందుకు సంబంధించిన దృశ్యాలను తన ఫోన్ ద్వారా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అంతే .. ఆ వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో.. ఈ అంశం వివాదాస్పదమైంది. ప్రతిదానికి ‘డూప్లికేట్’ని తయారుచేసే చైనా.. చివరికి జలపాతాన్ని కూడా విడిచిపెట్టలేదంటూ విమర్శలు వెల్లువెత్తాయి. నెట్ జనులు చైనాపై దుమ్మెత్తి పోశారు.
దీంతో.. యుంటాయ్ జియో పార్క్ నిర్వాహకులు కిందకు దిగొచ్చి, ఈ అంశంపై వివరణ ఇచ్చుకున్నారు. .తొలుత ఈ ఫేక్ జలపాతాన్ని సృష్టించినందుకు ఆ పార్క్ నిర్వాహకులు క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత ఈ పని ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు. వేసవి కాలంలో అక్కడ నీళ్లు ఎక్కువగా ఉండవని, చాలా తక్కువ మొత్తంలో మాత్రమే నీళ్లు కిందకు పారుతుంటాయని చెప్పారు. అది చూసి పర్యాటకులు నిరాశ చెందకుండా ఉండాలన్న ఉద్దేశంతో.. ఇలా పైపుల సహకారంతో నీళ్లు వదులుతున్నామని వివరించారు. ఏదేమైనప్పటికీ.. ఇదొక ఫేక్ వాటర్‌ఫాల్ అని తేలిపోవడంతో చైనా పరువు గంగలో కలిసిపోయింది. ‘పైన పటారం లోన లొటారం’ అన్నట్టు అయిపోయింది ఈ వ్యవహారం. అదండీ ఆ జలపాతం కథ.
Discussion about this post