ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ జట్టు కేవలం 159 పరుగులకే ఆలౌట్ అయింది. కేకేఆర్ బౌలర్ స్టార్క్ బౌలింగ్ దాటికి ఎస్ఆర్ హెచ్ బ్యాటర్లు పెద్దగా పరుగులు చేయకుండానే పెవిలియన్ బాటపట్టారు. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ బ్యాటర్లు.. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 13.4 ఓవర్లలో 164 పరుగులు చేశారు. ఫలితంగా ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్స్ దూసుకెళ్లారు.
కోల్ కతా వర్సెస్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ అంటే సమఉజ్జీల సమరంగా క్రికెట్ అభిమానులు భావించారు. మ్యాచ్ కోసం ఉత్కంఠభరితంగా ఎదురు చూశారు. కానీ, హైదరాబాద్ జట్టు పేలువ ప్రదర్శనతో ఫ్యాన్స్ చిన్నబుచ్చుకున్నారు. హైదరాబాద్ జట్టు ఓటమికి ప్రధానంగా మూడు కారణాలను క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ఐపీఎల్ సీజన్ లో హైదరాబాద్ జట్టు ప్రతీమ్యాచ్ లోనూ బ్యాటింగ్ విభాగంలో అటాకింగ్ గేమ్ ను ఆడుతూ వచ్చింది. ఓపెనర్లు హెడ్, అభిషేక్ లు దూకుడుగా ఆడి పరుగుల వరద పారించారు. ఆ తరువాత వచ్చిన బ్యాటర్లు సైతం అదే ఊపును కొనసాగిస్తూ ప్రత్యర్థులకు భారీ లక్ష్యాలను నిర్దేశిస్తూ వచ్చారు. క్వాలీఫయర్ -1 మ్యాచ్ లోనూ ఎస్ఆర్ హెచ్ అదే వ్యూహాన్ని అమలు చేసింది. కానీ, స్టార్క్ బౌలింగ్ దెబ్బకు వరుసగా వికెట్లు కోల్పోయారు. ఓపెనర్లు తక్కువ స్కోర్ కే ఔట్ అయ్యారు. ఒకానొక దశలో ఆ జట్టు 39 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయినా…తరువాత క్రీజులోకి వచ్చిన బ్యాటర్లుసైతం దూకుడుగాఆడే ప్రయత్నం చేసి వరుసగా వికెట్లు కోల్పోయారు. టాప్ ఆర్డర్ బ్యాటర్లు తక్కువ స్కోర్ కే పెవిలియన్ కు చేరినప్పుడు మిగిలిన బ్యాటర్లు కాస్త క్రీజులో నిలదొక్కకునేందుకు ప్రయత్నిస్తే మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
Discussion about this post