తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో రాష్ట్ర బీజేపీకి త్వరలోనే కొత్త అధ్యక్షుడు రానున్నారని పార్టీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి త్వరలోనే ఆ పదవికి రాజీనామా చేస్తారని చెబుతున్నారు. గతంలో బండి సంజయ్ స్థానంలో పార్టీ నియమించినపుడే అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకే పార్టీ బాధ్యతలు నిర్వహిస్తానని కిషన్ రెడ్డి అధిష్టానానికి చెప్పినట్టు తెలుస్తోంది. దీనికి తగినట్టే ఆయన రాజీనామాను అధిష్టానం ఆమోదిస్తే కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారనే దానిపై చర్చ జరుగుతోంది.
రాష్ట్రంలో బీజేపీకి బండి సంజయ్ మంచి ఊపు తెచ్చిన తరుణంలో బీజేపీ అధిష్టానం హఠాత్తుగా ఆయన స్థానంలో కిషన్ రెడ్డిని నియమించింది. అధిష్టానం ఇలా ఎందుకు చేసిందా అని పార్టీ శ్రేణులు అప్పట్లో ఆశ్చర్యపోయాయి. దీనిపై అప్పట్లో రకరకాల అనుమానాలు కూడా వ్యక్తమైన సంగతీ తెలిసిందే. ఈ నేపథ్యంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పరాభవం తప్పలేదు.
ప్రస్తుతం బీజేపీ అధిష్టానం.. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లకు సీఎంల నియామకం కసరత్తులో బిజీ బిజీగా ఉంది. దీంతోపాటు పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్నందున తెలంగాణలో బీజేపీ సాధించిన ఫలితాలపై అధిష్టానం పెద్దగా దృష్టి పెట్టలేదని చెబుతున్నారు. అయితే మూడు రాష్ట్రాలకు సీఎంల ఎంపిక పూర్తవగనే రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని కిషన్‌రెడ్డి భావిస్తున్నట్టు చెబుతున్నారు. తన లోక్ సభ నియోజకవర్గమైన సికింద్రాబాద్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క స్థానాన్ని కూడా బీజేపీ గెలవకపోవడంతో కిషన్ రెడ్డి గట్టి నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. ముందుగా తన నియోజకవర్గంలో పరిస్థితిని చక్కదిద్దుకోవాలనే ఆలోచనతో ఉన్నట్టుగా చెబుతున్నారు.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర అధ్యక్షుడి మార్పు సాధ్యం కాకపోవచ్చునని పార్టీ నేతలు కొందరు అంటున్నారు. మరి కొద్ది నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలు కీలకం కావడంతో పాటు తెలంగాణ నుంచి గతంలో గెల్చిన నాలుగు సీట్ల కంటే ఎక్కువ స్థానాలు గెలవాలనే లక్ష్యంతో అధిష్టానం ఉంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర నాయకత్వ మార్పు సాధ్యం కాకపోవచ్చుననే వాదన వినిపిస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దారుణ ఓటమి, కేవలం 8 సీట్లకే పరిమితం కావడంపై సామాజిక మాధ్యమాల్లో తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంపై పార్టీ అధిష్టానం దృష్టి పెడుతుందని, తర్వాతే ఒక నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. ఒకవేళ పార్టీ అధ్యక్షుడిని మార్చాలని అధిష్టానం నిర్ణయిస్తే బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్ ల పేర్లు పరిశీలనలోకి రావచ్చని అంటున్నారు.
Discussion about this post