భారత్ వేదికగా చైనాకు బైడెన్ సర్కారు పెద్ద షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు తైవాన్‌కు మద్దతుగా నిలిచిన అమెరికా.. తాజాగా టిబెట్‌కు అండగా నిలిచేందుకు సిద్ధమైంది. US హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఫారిన్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ మైఖేల్ మెక్కాల్ నేతృత్వంలోని ద్వైపాక్షిక US కాంగ్రెస్ ప్రతినిధి బృందం హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలకు చేరుకుంది. వారి రాకను అనుసరించి, కాంగ్రెస్ సభ్యులు టిబెట్‌లోని ప్రవాస పార్లమెంటు సభ్యులను కలిశారు. టిబెట్ అధినేత దలైలామాను కలిసేందుకు భారత్‌లో పర్యటించిన అమెరికా ప్రతినిధి బృందాన్ని చైనా హెచ్చరించింది.అమెరికా తప్పుడు సంకేతాలను పంపడం మానేయాలని భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం మంగళవారం పేర్కొంది.
అమెరికాలోని అధికారిక డెమోక్రటిక్ పార్టీలో ఓ సీనియర్ మహిళా నేత పేరు చెబితే అధ్యక్షుడు బైడెన్, మాజీ అధ్యక్షుడు ట్రంప్ అప్రమత్తమైపోతారు. ఎవరు చెప్పినా వినని మొండిఘటంగా ఆమెకు పేరుంది. ఏదైనా రిస్క్ అనుకుంటే అదే చేసి తీరుతుంది..! ఆ పెద్దావిడ పేరు నాన్సీ పెలోసీ. ఆమెకు చైనా వ్యవహారశైలి.. విధానాలంటే చెడ్డ చిరాకు. దీంతో డ్రాగన్ ఏది వద్దంటుందో అదే చేసి.. దానికి సవాలు విసురుతుంది. గతంలో ఈ పెద్దామె పర్యటనకు రక్షణగా అమెరికా వాయుసేనే రంగంలోకి దిగాల్సివచ్చింది. తాజాగా ఇప్పుడు ఆమె చైనాకు పుండుమీద కారం చల్లే పనిని భారత్ వేదికగా చేసింది. దానికి సంబంధించిన ఫొటో మీరు చూడొచ్చు . దీని వెనుక అసలు విషయం చాలా ఉంది .
అమెరికా ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ అత్యున్నతస్థాయి కాంగ్రెస్ బృందాన్ని తీసుకొన్ని భారత్ పర్యటనకు వచ్చారు. దీనిలోభాగంగా ఆమె మంగళవారం ధర్మశాలలోని టిబెట్ ప్రవాస ప్రభుత్వాధినేత దలైలామాతో భేటీ అయ్యారు. ఆమె వెంట వచ్చినవారిలో అమెరికాలోని శక్తిమంతమైన ఫారెన్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ మిషెల్ మెక్కౌల్తోపాటు డెమోక్రటిక్, రిపబ్లికన్ సభ్యులు ఉన్నారు.
హౌస్స్పీకర్ హోదాలో ఉన్న వేళ కూడా నాన్సీ పెలోసీ తైవాన్ విషయంలో చైనాను లెక్క చేయలేదు. అప్పట్లో ఆమె తైపీ పర్యటన అమెరికా-చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పెలోసీ పర్యటనకు వెళ్లిన విమానానికి అమెరికా ఫైటర్ జెట్లు రక్షణగా వెళ్లాల్సి వచ్చింది. ఆమె పర్యటన అనంతరం చైనా భారీఎత్తున యుద్ధ విన్యాసాలు నిర్వహించిన విషయం తెలిసిందే.
అమెరికా బృందం భారత్‌లోని ధర్మశాలలో ఉన్న దలైలామాను కలిస్తే చైనా ఎందుకు ఆందోళన చెందుతుందన్నదే ఇక్కడ కీలకం. ఇటీవల అమెరికా చట్టసభలో గత వారం ‘ప్రమోటింగ్ ఏ రిసొల్యూషన్ టూ ది టిబెట్-చైనా డిస్ప్యూట్ యాక్ట్’ లేదా ‘ది రిసాల్వ్ టిబెట్ యాక్ట్’ ను సిద్ధం చేశాయి. దీనికి గతంలో సెనేట్ ఆమోద ముద్ర వేయగా.. గత వారం ప్రతినిధుల సభ కూడా 391-26 ఓట్ల తేడాతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ప్రకారం టిబెట్ నాయకులతో చైనా చర్చలు మొదలుపెట్టాలని అమెరికా కోరనుంది. వాస్తవానికి ఈ చర్చలు 2010లోనే నిలిచిపోయాయి. దీంతోపాటు ఇవి అక్కడి ప్రజలు తమ సాంస్కృతిక, చారిత్రక గుర్తింపును కోల్పోకుండా ఉండేలా చూసుకొంటూ టిబెట్‌తో ఒప్పందానికి రావాలని సూచిస్తుంది. అంతేకాదు.. టిబెట్ చరిత్ర, ప్రజలు, సంస్థలపై చైనా చేపట్టే తప్పుడు ప్రచారాన్ని అడ్డుకొనేందుకు అమెరికా విదేశాంగశాఖ నేరుగా పనిచేస్తుంది. నిధులను కూడా సమకూర్చే అవకాశం లభిస్తుంది. అంటే ప్రపంచానికి టిబెట్ విషయంలో అసలు నిజాలు చూపించే పని అన్నమాట. ఇక ఈ బిల్లులో ‘టిబెట్’ అర్థం భిన్నంగా ఉంది. టిబెట్ అటానమస్ రీజియన్‌తోపాటు.. గన్సూ, క్వింగ్హై, సిచువాన్, యునాన్ ప్రావిన్స్‌లను కలిపి చూపింది. ఈ బిల్లు ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు బైడెన్ టేబుల్‌పై ఉంది. ఆయన సంతకం పెట్టడమే తరువాయి. ఈ బిల్లును ఆపాలని అమెరికాపై ఇప్పటికే బీజింగ్ నుంచి తీవ్రస్థాయి ఒత్తిడి ఉంది.
అమెరికా ప్రతినిధులు దలైలామాతో భేటీ కావడంపై చైనా మండిపడింది. ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ మాట్లాడుతూ ‘‘14వ దలైలామా కేవలం ఆధ్యాత్మిక వ్యక్తి మాత్రమే. ప్రవాస టిబెట్ ప్రభుత్వం చైనా వ్యతిరేక వేర్పాటువాద కార్యకలాపాలను మతం ముసుగులో చేస్తోంది. తాజాగా వస్తున్న నివేదికలపై తీవ్ర ఆందోళన చెందుతున్నాం. దలైలామా గ్రూపును చైనా వ్యతిరేక వేర్పాటువాద శక్తిగా గుర్తించాలని కోరుతున్నాం. గతంలో టిబెట్‌కు చైనా పెట్టిన పేరు షిజియాంగ్ విషయంలో అమెరికా ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలంటున్నాం. ఏ రూపంలోనూ దలైలామాతో సంబంధాలు పెట్టుకోవద్దు.. ప్రపంచానికి తప్పుడు సంకేతాలు పంపడం ఆపండి’’ అని తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తంచేశారు. అదే సమయంలో బైడెన్ ‘ది రిసాల్వ్ యాక్ట్’పై సంతకం చేయవద్దని కోరారు. టిబెట్ చైనాలో పూర్తిగా ఓ అంతర్భాగమని పేర్కొన్నారు. దానిని కాపాడుకోవడానికి బలమైన చర్యలు తీసుకొంటుందని హెచ్చరించారు. తాజాగా దీనిపై శ్వేతసౌధం స్పందించింది. తమ అధ్యక్షుడు అమెరికా ప్రయోజనాలకు అవసరమైన నిర్ణయాన్ని కచ్చితంగా ఆలోచించే తీసుకొంటారని పేర్కొంది.
Discussion about this post