భారత క్రికెట్ జట్టు కోచ్ గా రాహుల్ ద్రావిడ్ పదవీకాలం పూర్తయింది. వరల్డ్ కప్ విజయంతో తన కోచ్ పదవికి ద్రావిడ్ ఘనంగా వీడ్కోలు పలికాడు. ద్రావిడ్ స్థానంలో కొత్త కోచ్ ను ఎంపిక చేసే పనిలో బీసీసీఐ బిజీగా ఉంది. ఇప్పటికే ఇంటర్యూ ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ ప్రక్రియలో ఇద్దరిని షార్ట్ లిస్ట్ చేసినట్టు బీసీసీఐ సెక్రటరీ జైషా ప్రకటించారు. త్వరలోనే ఒకరిని ఎంపిక చేయనున్నట్టు వెల్లడించారు. క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఇద్దరి పేర్లను షార్ట్ లిస్ట్ చేసిందని, త్వరలోనే దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బోర్డు వర్గాల సమాచారం ప్రకారం కోచ్ గా గంభీర్ పేరు దాదాపు ఖారారైనట్టు భావిస్తున్నా… మరో వ్యక్తి డబ్ల్యూవీ రామన్ కూడా గట్టిపోటీ ఇస్తున్నాడు. గతంలో భారత మహిళల జట్టుకు రామన్ కోచ్ గా వ్యవహరించాడు. ఇంటర్యూలో రామన్ ఐడియాలు కూడా కమిటీని ఇంప్రెస్ చేసినట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే గంభీర్ , రామన్ పేర్లు షార్ట్ లిస్ట్ అయినట్టు సమాచారం. అటు ఐపీఎల్ లో జట్లకు మెంటార్ గా వ్యవహరించిన గంభీర్ వైపే ఎక్కువ శాతం మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కాగా జింబాబ్వే టూర్ కు వివిఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్ గా వ్యవహరించనున్నట్టు జైషా తెలిపారు. శ్రీలంకతో సిరీస్ కు కొత్త కోచ్ జట్టుతో పాటు వెళతారని వెల్లడించారు.
Discussion about this post