తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం హాట్ సీటుగా మారింది. ఇక్కడ బీఆర్‌ఎస్ నుంచి మంత్రి పువ్వాడ అజయ్, కాంగ్రెస్ తరపున మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోటీపడుతున్నారు. ఇద్దరు పాత కాపులే .. మళ్ళీ మరోమారు బరిలోకి దిగారు. కాకపోతే పార్టీలు మారాయి.
ప్రచారంలో భాగంగా ఇద్దరు పరస్పరం విమర్శల బాణాలు ఎక్కుబెడుతున్నారు. ఇద్దరి మధ్య మాటల తూటాలూ పేలుతున్నాయి. ప్రచారం ఉధృతమవుతున్న కొద్ది ఇద్దరి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. గతంలో పాలేరు, ఖమ్మంలో చెల్లకుండా పోయిన రూపాయి ఇప్పుడు మళ్లీ ఖమ్మం వచ్చిందని ఈ మధ్య మంత్రి పువ్వాడ అజయ్ తన ప్రత్యర్థి తుమ్మలపై సెటైర్లు వేశారు. తళతళలాడో కొత్త వంద రూపాయల నాణెం వంటివాడిని తానని మంత్రి పువ్వాడ అజయ్ అంటున్నారు.
తనను నాన్ లోకల్ అంటున్న పువ్వాడ మాటలను తుమ్మల తప్పుబట్టారు. ఆయన ఎక్కడివారో తెలుసుకుంటే మంచిదని సూచించారు. మంత్రిగా ఉన్నప్పుడు కూడా తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంను అభివృద్ధి చేయలేదని పువ్వాడ ఆరోపించారు. ఖమ్మం ప్రజలనే కాదు, సీఎం కేసీఆర్‌ను కూడా తుమ్మల మోసం చేశారని విమర్శించారు. పువ్వాడ కామెంట్స్‌ను తుమ్మల నాగేశ్వరావు తప్పుబట్టారు. దేశంలో ఎవరు ఎక్కడైనా పోటీ చేయవచ్చనే విషయం తెలియదా అని ప్రశ్నించారు. ఎక్కడికి వెళ్లినా తాను గెలిచానని, ఖమ్మం నియోజకవర్గం దాటితే పువ్వాడను గుర్తు పట్టేవారే ఉండరని తుమ్మల విమర్శించారు. తాను చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదని, అది కళ్ల ముందే కనబడుతోందని తుమ్మల అంటున్నారు. అభివృద్ధి కావాలా? అరాచకం కావాలో కోరుకోవాలని ఖమ్మం ఓటర్లను ప్రశ్నిస్తున్నారు.
తాజాగా ఈ విమర్శల పర్వం మరో అడుగు ముందుకు వెళ్లింది. పువ్వాడ దాఖలు చేసిన అఫిడవిట్ నిర్దేశించిన ఫార్మట్‌లో లేదని ఎన్నికల సంఘానికి తుమ్మల నాగేశ్వరరావు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పువ్వాడ దాఖలు చేసిన నాలుగు సెట్ల నామినేషన్లలో తప్పులున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్ కూడా ఈ నియోజకవర్గంలో ప్రచారం చేసి వెళ్లారు. సీఎం కూడా తుమ్మలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
పువ్వాడ అజయ్ ఖమ్మం నుంచి 2014 లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 5,682 ఓట్ల మెజారిటీ తో గెలిచారు. నాడు తుమ్మల టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. 2018లో అజయ్ బీఆర్ఎస్ నుంచి పోటీచేసి 10,991 ఓట్ల మెజారిటీ తో విజయం సాధించారు. నాడు నామా నాగేశ్వరరావు టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. తర్వాత కాలంలో తుమ్మల బీఆర్ఎస్ లో చేరి కొంతకాలం అనంతరం కాంగ్రెస్ లో చేరారు. మొత్తానికి ఇద్దరు దిగ్గజ నేతల పోరుతో ఖమ్మం నియోజకవర్గం ఈ ఎన్నికల్లో కీలక నియోజకవర్గంగా మారింది. ఈ సారి ఫలితం ఎలా ఉంటుందో ? చూడాలి.
Discussion about this post