అంతరిక్ష పరిశోధనా స్థానమున్న సూళ్లూరు పేటలో ఎన్నికల ఫలితాల కౌంట్ డౌన్ మొదలయింది. సార్వత్రిక ఎన్నికల విజేత ఎవరనే విషయం అంచనాలకు అందక ఉత్కంఠ నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కలివేటి సంజీవయ్య కు మరోదఫా అవకాశం లభిస్తోందా ? సూళ్లూరు పేట ఓటర్లు టీడీపీ అభ్యర్థి విజయ ను ఆదరించి అక్కున చేర్చుకుంటారా ? అనే అంశం పై సస్పెన్స్ నెలకొంది.
వాస్తవానికి నాయకత్వ బలమున్న వైసీపీ పార్టీ నుంచి వార్ వన్ సైడ్ కావాల్సి ఉంది. పోలింగ్ వరకూ అదేవిధమైన పరిస్థితిని తలపించింది. టీడీపీ నుంచి మహిళను అభ్యర్థిగా రంగం లోకి దించడం, ఆమె ప్రాధాన్యం అంతంత మాత్రం కావడంతో వైసీపీ గెలుపు నల్లేరుపై నడకన్న అభిప్రాయం సర్వత్రా వెల్లడైంది.సూళ్లూరుపేట నియోజకవర్గంలో వైసీపీ జెండా రెప రెప లాడుతోందన్న కథనాలు ఊపందుకున్నాయి. పోలింగ్ అనంతరం కొన్ని వర్గాలు పనిగట్టుకొని ఓటేసిన పరిస్థితి వైసీపీ పక్షాలను ఆందోళనలోకి నెట్టింది. వైసీసీ లో అంతర్గతం గా ఉన్న పొరపచ్చాలు చాపకిందనీరులా మారి ఎన్నికల నిర్వహణపై ప్రభావితం చూపాయన్న చర్చలు ప్రజా క్షేత్రం లో చక్కెర్లు కొడుతున్నాయి. గెలుపు ధీమా కల చెదిరిపోయి స్వల్పమెజారిటీ తో అయినా వైసీపీ గట్టెక్కుతోందన్న భావనే ప్రస్తుతం నెలకొంది. టీడీపీ అభ్యర్థి మహిళ కావడంతో ముమ్మాటికీ విజయం వరించదన్న పురుషాధిక్య వాదన వినిపిస్తోంది.
వాస్తవానికి సంజీవయ్య మృదుస్వభావి .. గొడవలను ప్రోత్స హించే వారు కాదన్న మంచి పేరు ఉన్నప్పటికీ, ఇతర ప్రాంతాలకు ఏమాత్రం తీని పోనివిధంగా ఇసుక , మట్టి , మాఫీయా సూళ్లూరు పేట నియోజకవర్గంలో విచ్చలవిడిగా సాగిందన్నఅపవాదు ఎన్నికల నాటికి కూడా వైరల్ అవుతూనే ఉంది. ప్రకృతి వనరులను అడ్డంగా దోచేసిన పరిస్థితికి పరాకాష్టగా వెలసిన ఇసుక కొండలు సూళ్లూరు పేటలోనూ దర్శనమిచ్చాయి. ప్రజాక్షేత్రాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా ప్రభుత్వం సహకారంతో ఎడా పెడా దోచేసిన పరిస్థితులను ప్రజాక్షేత్రం గమనిస్తూ పోలింగ్ సమయానికి దర్మా, అదర్మాల ప్రసక్తిని వెలికి తీసి తీర్పు ను అందించేందుకు సిద్దమైంది. రాష్ట్ర సరిహద్దు కావడంతో భారీగా పొరుగున ఉన్నతమిళ రాజధాని నగరానికి సాగిన ఇసుక , సిలికా అక్రమ రవాణా ను ఎమ్మెల్యే అరికట్టలేక పోయారన్న విమర్శలు ఊపందుకొన్నాయి. MLA అనుచరులే అక్రమమైనింగ్ నిర్వహించి , ఎమ్మెల్యేకు కూడా పర్శంటేజీలు దండిగా సమకూర్చారని ప్రతిపక్షాలు దుమెత్తి పోశాయి. అనుచరుల కు హఠాత్తుగా సమకూరిన సంపదలు ప్రతిపక్షాల విమర్శలకు బలాన్ని చేకూర్చాయి.
బటన్ నొక్కుడు ప్రయోజనం అసలైన లబ్ధిదారులకు సాంతం అందని పరిస్థితి సూళ్లూరు పేట నియోజవర్గంలో అధికమైంది.లేని ఆస్తుల సాకుగా చూపి కొన్ని విడతలు లబ్ధిదారులకు సంక్షేమ ప్రయోజనాలు చేరని పరిస్థితి ఎన్నికల నాటికి వ్యతిరేఖతగా మారింది. భారీగా చెల్లించిన కరెంటు బిల్లులలో తమ పేరున నమోదు కావడం వంటి పరిపాలన వైఫల్యాలు వైసీపీ ప్రతిష్టను సూళ్లూరు పేట నియోజకవర్గంలో దెబ్బతీశాయన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం . వాలంటీరు, సచీవాలయ వ్యవస్థ లు ఉన్నప్పటకీ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొకతప్పలేదు. గతంలో పంచాయతీ , మండల కేంద్రాల వరకూ వెళ్లే పరిస్థితి నుంచి కాస్తా ఉపశమనం కలిగిందన్న అభిప్రాయమే వ్యక్తమైంది. తమ ప్రాంతంలో ఉండే సచీవాలయాలను పలుమార్లు ఆశ్రయించక తప్పలేదు. దూరం తగ్గడం ఒక్కటి మినహా ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రయోజనాలు అందక లబ్డిదారులు ఎదుర్కొన్న ఇబ్బందులు అనేకం. స్థానికంగా ఉన్న అధికార పార్టీ కార్యకర్తను సంప్రదించాలన్నా.. వారు వాలంటీరు స్థాయికి దిగదుడుపు అన్న అభిప్రాయం వ్యక్తమైంది. అంతా అన్ లైన్ అంటూ సచీవాలయాల చుట్టూ తిప్పు కొని వేధించిన తీరు ఎన్నికల నాటికి ప్రభుత్వం పై వ్యతిరేఖతగా మారింది. ఓటరు పోలింగ్ లో చేతివాటాన్ని చూపి వైఫల్యాల పై చెళ్లు మనిపించారన్న సమాచారం వైసీపీ వర్గాలను అయోమయంలో నెట్టింది
వైసీపికి గుంభనంగా బటన్ నొక్కి మద్దతు తిచ్చిన వారిలో సంక్షేమ ప్రయోజనాలను అందుకొన్న వారు అధికం. తమకు లభించింది ప్రజాధనం అయినా, దళారీలు లేకుండా దరి చేర్చింది, జగనే కదా అన్న సానుకూల స్పందన పోలింగ్ వరకూ కొనసాగింది. లబ్ధిపొందిన ఇంటికి ఒకరు మాత్రమే స్థానిక అభ్యర్థితో పనిలేకుండా ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కి అభిమానాన్ని చాటుకొన్నారు. పెరిగిన ధరలు, రాజ్యాంగ వ్యవస్థల అస్తిత్వాన్ని ప్రభావితం చేసే స్థాయిలో సాగిన అధికార దుర్వినియోగం, తదితర ఘటనలతో ఇంటిల్లిపాది కృతజ్ఙత చూపే స్థాయి లేదన్నభావనే అధికమైంది. సూళ్లూరు పేటలోనూ అధికార పార్టీ వ్యక్తుల చర్యలకు ఇబ్బందులను ఎదుర్కొన్నవారికి ప్రతిపక్షాలు ఆశ్రయమిచ్చారు.ఈ మేరకు దశాబ్ధంపాటు ప్రజాప్రతినిధిగా ఉన్న సంజీవయ్య సామర్థ్యాన్ని చూపలేక పోయారన్న అసంతృప్తి ప్రతికూలంగా మారిందన్నమాట వాస్తవం. మరో ఐదేళ్లు సంజీవయ్యకే అవకాశం ఇవ్వాలా అనే విషయంలో మెజారిటీ అభిప్రాయలు ప్రతికూలమయ్యాయి. పార్టీ నిర్ణయం సంజీవయ్యనే కొనసాగించడంతో అంతర్గత అసమ్మతి సెగ కొంతమేరకు తగ్గినా సహాయ నిరాకరణ విధానమే సాగిందన్నది విశ్లేషకుల వాదన.
సూళ్లూరు పేటలో గెలుపు స్పష్టం కాని సంకేతాలే వెలువడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు. అప్పటికీ సూళ్లూరుపేటలో ఉన్న వేనాటి వర్గం లో పెద్ద తలకాయ వైసీపీ పక్షం వహించింది. అయినప్పటీకీ ఆయన అనుభవాన్ని వినియోగించుకోవడంలో కలివేటి చొరవ చూపలేదని మాటలు ఆయా వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే వేనాటి వర్గానికి చెందిన కొందరు టీడీపీలోనే అగిపోయారు. వేనాటి వర్గంలో కీలకమైన మునిరెడ్డి కుమారుడు టీడీపీ పక్షంలోనే కొనసాగుతూ ఎన్నికల ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
టీడీపీ అభ్యర్థి నెలవల విజయశ్రీ, నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తె కావడం ఒక్కటే ఆమెకున్న వ్యక్తిగతప్రాధాన్యం. నెలవల సుబ్రహ్మణ్యం ఎన్నికల రాజకీయాన్ని ఆమాంతం తన వైపుకు తిప్పుకొనే రాజకీయ చరిష్మా ఉన్న వారు కాదు. ఆయన కూడా గతంలో రిజర్వేషను ప్రాతిపధికన అప్పటి కాంగ్రేస్ నాయకులు మాజీ సీఎం నేదురుమల్లి జనార్థన్ రెడ్డి అనుచరునిగా రాజకీయ అరంగ్రేట్రం చేసి ఎమ్మెల్యే అయినవారే.ఆయన కుమార్తె కు టీడీపీ అభ్యర్థి కావడమే కేవలం ఆమె బలం. గంగా ప్రసాద్ టీడీపీ నాయకత్వాన్ని కొనసాగిస్తూ వైపీసీ అసమ్మతులను అనుకూలం చేయడంతో రాజకీయ అనుభవాన్ని పండించారు. వైసీపీ నుంచి టీటీపీ పక్షం వహించిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంలో సయోద్య సాగించారు. జనసేన, బీజేపీ వర్గాలను కలుపుకు పోవడంలోనూ సఫలీకృతులు కావడంతో టీడీపీ కి పోలింగ్ లోనూ లాభం చేకూరింది
సూళ్లూరు పేటలో ఇద్దరు నాయకుల పాత్ర ప్రత్యేకతను చాటుతోంది. ఒకరు పెళ్లకూరు మండలాన్ని ప్రభావితం చేసేస్థాయిలో సామర్ధ్యమున్న సత్యనారాయణ రెడ్డి వైసీపీ మద్దతు దారుగా ఉన్నారు. మరొకరు శిరసనంబేడు విజయ భాస్కర్ రెడ్డి నాయుడు పేట మండలంలో పేరెన్నికగన్న టీడీపీ నాయకులు. ఇరువురికీ పార్టీ ప్రాధాన్యత లే ముఖ్యం . అభ్యర్థి ఎవరైనా పార్టీ నిర్ణయం శిరోధార్యంగా పనిచేస్తూ విజయావకాశాల కోసం పనిచేస్తూనే ఉంటారు. తమ సొంత నిధుల వెచ్చించి కూడా వీరు వర్గాలను కొనసాగిస్తూ వారి వారి పార్టీలకు లబ్ది చేకూరే లా ఉనికిని చాటుతోన్నారు. ప్రధాన నాయకుల పర్యటనలలో వీరు ప్రత్యేకించి జనసమీకరణ తో సభలను నిర్వహించడం, అన్నీవేళల తమను ఆశ్రయించిన వారి కోసం పనిచేస్తుండటం కారణంగా ప్రజాక్షేత్రంలో కొంత అనుకూలత ఉంది. నాయుడు పేటలో విజయబాస్కర్ రెడ్డి హవాకు తోడు వైసీపీ లో కిలకంగా ఉన్న 786 రఫీ టీడీపీ పక్షం వహించడంతో నాయుడు పేట మండలం లో పోలింగ్ టీడీపీ పక్షమన్న ఊహాగానాలు వెల్లువెత్తాయి. పెళ్లకూరు మండలంలో సత్యనారాయణ రెడ్డి సహకారంతో వైసీపీ ముందజలో ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి .
సూళ్లూరు పేటలో ఏ కోణం నుంచి చూసినా కలివేటి సంజీవయ్యను మరో ఐదు సంవత్సరాలు కొనసాగించే విషయంపై వ్యతిరేఖత కొనసాగుతోంది. ప్రతిపక్షానికి ఎనలేన ప్రయోజనం కలిగించిందన్న అభిప్రాయం మెండుగా వ్యక్తం అవుతోంది. వైసీపీకి గెలపు ఖాయం అనుకుంటున్నసూళ్లూరుపేట లో కూడా అధికార పార్టీ కి వ్యతిరేఖ పవనాలు గట్టిగానే వీచాయన్నది స్పష్టమౌతోంది. ఈ పరిస్థితిని అనుసరించి సమీకరణాలు కృత్రిమ మేథో మథనం తో పరిశీలిస్తే టీడీపీ వైపు గెలుపు గాలి వీచే పరిస్థితి కనిపిస్తోందని కొన్ని సంస్థలు వెల్లడిస్తోన్నాయి. అంతా భావిస్తోన్నట్లు వైసీపీ కి విజయం చేజారుతోందా , సిట్టింగ్ ఎమ్మెల్యే సంజీవయ్య హ్యాట్రిక్ విజయాన్ని సాధించే అవకాశం దాదాపు దూరమైందా అనే చర్చలు ఉత్కంఠను రేపుతున్నాయి.టీడీపీ అభ్యర్థి విజయాన్ని సాధిస్తే మహిళ ఒంటరి పోరాటాన్ని ప్రజలు గట్టెక్కించడమే అవుతుంది. సరికొత్త రాజకీయానికి నాంది పలక నున్న సూళ్లూరుపేట ఫలితాల పై లెక్కింపు వరకు ఉత్కంఠ తప్పడంలేదు.
Discussion about this post