బానిస బతుకుకు చరమగీతం పాడి, పోరాటం ద్వారా హక్కులన్ని దక్కుతాయాని చాటిన రోజు మేడే. శ్రమ దోపిడికి వ్యతిరేకంగా కార్మిక లోకం కదం తొక్కిన రోజు. రక్తాన్ని చిందించి 8 గంటల పని హక్కును సాధించుకున్న రోజు. ప్రపంచ కార్మికోద్యమానికి ప్రతీకగా ప్రతి ఏడాది మే 1న కార్మిక దినోత్సవం నిర్వహిస్తారు.‘ ప్రపంచ కార్మికులారా ఏకం కండి.. పోరాడితే పోయేదేమి లేదు బానిస సంకెళ్లు తప్ప’ అన్న నినాదాలు ప్రపంచ కార్మిక గతినే మార్చేశాయి. చికాగో కార్మికుల పోరాట స్ఫూర్తి ప్రపంచ కార్మికుల్లో ఉద్యమ వేడిని రగిల్చింది. అమెరికాలో కార్మికులు చిందించిన రక్తమే ఎర్రజెండాగా అవతరించింది. 1886లో మేడే ప్రారంభమైంది. దీనిపై మరింత సమాచారం మీ కోసం…
అప్పట్లో అమెరికాలోని పెట్టుబడి దారులు కార్మికులతో రోజుకు 15 నుంచి 20 గంటలు చాకిరీ చేయించుకుంటూ.. కార్మికులను బానిసల్లా చూసేవాళ్లు. పరిశ్రమల్లోనే కార్మికుల బతుకులు తెల్లారిపోయేవి. ఈ నరకయాతన నుంచి విముక్తి కోసం చికాగో పట్టణంలో కార్మికులు పోరుబాట పట్టారు. 8 గంటల పని దినం కోసం సమర శంఖం పూరించారు. డిమాండ్ల సాధనకు ఐక్యంగా సమ్మెకు దిగారు. కార్మిక సమ్మెను సహించలేని యజమానులు.. గూండాలను, పోలీసులను ప్రయోగించారు. ఖాకీల కాల్పుల్లో అనేకమంది కార్మికులు నేలకొరిగారు. రక్తం ఏరులై పారింది. ఆ అమరవీరుల రక్తంతో తడిచి నింగికి ఎగసింది ఎర్ర జెండా. అదే నేడు ప్రపంచంలోని కార్మికులందరికీ పోరాట పతాక మైంది. చరిత్రలో ఒక చైతన్య దినంగా నిలిచిపోయింది.
కార్మికోద్యమ ఘర్షణల్లో ఒక కానిస్టేబుల్ మరణించాడు. దీన్ని సాకుగా తీసుకొని నలుగురు కార్మికనేతల్ని ఉరితీశారు. ఇది ప్రపంచ కార్మికులకు ఆగ్రహం తెప్పించింది. పోరాటాలు ఉద్ధృతమయ్యాయి. ప్రభుత్వాలు దిగొచ్చాయి. పనివేళలను కుదిస్తూ అమెరికా చట్టాన్ని తీసుకొచ్చింది. తరవాత మరికొన్ని దేశాలూ అదే బాట పట్టాయి. మేలో జరిగిన చికాగో దుర్ఘటన గొడ్డు చాకిరీ నుంచి విముక్తికి పునాది వేసింది కాబట్టి, మే 1ని ‘ప్రపంచ కార్మిక దినోత్సవం’గా జరుపుకోవాలని, ఆ రోజు శ్రామికులంతా పనికి విరామమిచ్చి వీధుల్లోకి వచ్చి తమ గొంతు వినిపించాలనీ ప్యారిస్‌లో జరిగిన సోషలిస్టు లేబర్ పార్టీల ‘సెకండ్ ఇంటర్నేషనల్’ సమావేశం నిర్ణయించింది. అదే భారత్ సహా అనేక దేశాల్లో ‘మే డే’గా మారింది. ఈ పోరాట స్ఫూర్తితో ప్రపంచ వ్యాప్తంగా 8 గంటల పని, వేతనాల పేంపు, భద్రత కోసం ఉద్యమాలు ఉధృతమయ్యాయి. రష్యాలో 1917 మొదటి సోషలిస్టు ప్రభుత్వం ఏర్పాటుకు దారి తీశాయి.
Discussion about this post