అక్కడ నివసించే వీరంతా ఆదివాసి గుత్తి కోయ కులానికి చెందినవారు. జ్వరం వస్తే కూడా ప్రభుత్వ పరంగా ఎలాంటి వైద్య సదుపాయాలు వారికి అందుబాటులో లేవు. దీంతో వీరికి జ్వరం వస్తే అది తగ్గాలని తమ కులదైవాన్ని వేడుకోవడం… తగ్గకపోతే కాలినడకనే సుదూరంగా ఉన్న పట్టణానికి వెళ్లి ఆస్పత్రిలో చూపించుకుంటారు. ఎవరు బయట ప్రాంతానికి వెళ్లాలన్నా కనీస రోడ్డు సదుపాయం కూడా లేదు.
ఇప్పుడు మీరు చూస్తున్నది ఓ ముప్పై గిరి పుత్ర కుటుంబాల గాధ. వీరంతా ఏనాడో పొరుగు రాష్ట్రం ఛత్తీస్ ఘఢ్ నుంచి వలస వచ్చారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో గుడారాలు ఏర్పాటు చేసుకొని 20 ఏళ్లుగా జీవిస్తున్నారు. అడవిలో పోడు వ్యవసాయం చేసుకుంటూ అక్కడే దొరికే ఫలాలను సమీప పట్టణానికి తీసుకొని వెళ్లి అమ్మడం, తద్వారా వచ్చే డబ్బులతో అక్కడి నుంచి తమకు కావలసిన సరుకులు కొనుక్కొని జీవనం సాగిస్తున్నారు ఈ ఆదివాసి బిడ్డలు. వీరికి ప్రభుత్వ పరంగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు లాంటి గుర్తింపు కార్డులన్ని ఉన్నాయి. కానీ ఏదైనా అనారోగ్యం బారిన పడితే తమ దేవున్ని నమ్ముకోవాల్సిందే.
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా గ్రామం సమీపంలో దేవునిగుట్ట వద్ద నివశిస్తున్న గుత్తికోయల ఇబ్బందుల గురించి తెలిసిన ఫోర్ సైడ్స్ టీవీ బృందం అక్కడకు వెళ్ళింది. వారు పడుతున్న ఇబ్బందులను బయటి ప్రపంచానికి… ముఖ్యంగా ప్రభుత్వ అధికారులకు చేరవేసే ప్రయత్నం చేసింది. దట్టమైన అటవీ ప్రాంతంలో నివశిస్తున్న గుత్తికోయలకు వైద్య సదుపాయం అభించని పరిస్థితిని ప్రత్యక్షంగా చూసి ప్రసారం చేసింది. ఇంతకాలం పస్త్ర గ్రామం వైపు కన్నెత్తి చూడని అధికారులు, ఆదివాసి బిడ్డల జీవనశైలి పై ఫోర్ సైడ్స్ టీవీ వార్త ప్రసారం చేసిన విషయం తెలుసుకొని వెంటనే ఆ గ్రామానికి వెళ్లారు. దేవుని గుట్ట వద్ద నివసిస్తున్న ఆదివాసి ప్రజల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
పస్రా మెడికల్ అధికారి డాక్టర్ మధు 22 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లాలోనే మలేరియా కు అత్యంత ప్రమాదకర కేంద్ర బిందువుగా ఉన్న తింగరావుపేట పస్రా గ్రామాన్ని సందర్శించిన వైద్య బృందం అక్కడ ఎవరికి మలేరియా లేదని గుర్తించింది. అయితే కొంతమంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధుల పట్ల వారికి అవగాహన కల్పించారు.
ఇంతకాలం తాముండే దేవునిగుట్ట వైపు అధికారులెవరూ వచ్చే వారు కాదని గుత్తికోయలు ఫోర్ సైడ్స్ టీవీకి తెలిపారు. జ్వరం వచ్చినప్పటికీ కాలినడకనే ఇబ్బంది పడుతూ వెళ్లే వారిమని చెప్పారు. టీవీ వాళ్లు వచ్చిన విషయం తెలుసుకొని వైద్యాధికారులు వచ్చిన పరీక్షలు నిర్వహించినందులు వారు ఫోర్ సైడ్స్ టీవీకి ధన్యవాదాలు తెలిపారు.
Discussion about this post