ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ కొట్టేస్తాం అంటుండగా … ఆ పార్టీకి అంత సీన్ లేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ప్రధాని మోదీ సారథ్యంలో గత ఎన్నికల్లో 303 స్థానాలను సాధించిన బీజేపీ ఈ సారి 370 సీట్లు వస్తాయని చెబుతోంది. ఎన్డీఏకు అయితే 400 దాటడం ఖాయమని బీజేపీ నేతలు అంటున్నారు. ఎన్నికల్లో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెడుతూ.. ప్రతిపక్ష పార్టీలను ఆత్మరక్షణ లోకి నెడుతూ.. బీజేపీ తనదైన శైలిలో దూకుడుగా ముందుకెళ్తోంది. అయితే, కమల నాథుల లక్ష్యం నెరవేరుతుందా..? మోదీ ఆకర్షణ మంత్రంతో అనుకున్నది సాధిస్తుందా..?సౌత్ లో ఆ పార్టీ బలం పెరుగుతుందా ? దేశవ్యాప్తంగా బీజేపీ పరిస్థితి ఏమిటో ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం.
బీజేపీ ‘బలం’ అంతా మోదీనే. ప్రజలను సమ్మోహితులను చేసే శక్తితో ఏ ప్రతిపక్ష నేతకూ అందనంత ఎత్తులో ఉన్నారాయన. గట్టి ప్రతిపక్షాలున్న రాష్ట్రాలు, పార్టీకి సంస్థాగత బలం లేని రాష్ట్రాల్లోనూ మోదీ ఆకర్షణే కమలానికి కొండంత బలం. 2014లో ఈ ఆకర్షణే బీజేపీకి భారీగా సీట్లు వచ్చేలా చేసింది. 2019లో తెలంగాణ, ఒడిసా లోనూ ఆ పార్టీ సత్తా చాటేందుకు కారణమైంది. జాతీయ నాయకత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిన కారణంగా చాలా రాష్ట్రాల్లో బీజేపీ సంస్థాగతంగా బాగా బలపడింది. ఇది ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు ఉపయోగపడనుంది. రామ మందిరాన్ని సాకారం చేశామంటూ హిందీ బెల్ట్‌లోని ఓటర్లను ఆకట్టుకుంటోంది. జాతీయవాదంతో ఇప్పటికే ఓ వర్గం ప్రజలను తనవైపు తిప్పుకొన్న బీజేపీ.. సంక్షేమ మంత్రంతో మిగతా వర్గాలనూ కలుపుకొనిపోతోంది.
గత ఏడాది చివర్లో కాకలు తీరిన సీనియర్లను పక్కనపెట్టి, ఉత్తరాదిన బలమైన సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకుని రాజస్థాన్ లో భజన్‌లాల్ శర్మ .. మధ్యప్రదేశ్ లో మోహన్ యాదవ్ , ఛత్తీ్స్ గఢ్ లో విష్ణుదేశ్ సాయీ లను ముఖ్యమంత్రులను చేసింది బీజేపీ. అలాగే హర్యానా లో ఖట్టర్‌ను అనూహ్యంగా మార్చేసి సీఎంగా నాయబ్ సైనీకి బాధ్యతలు అప్పగించింది. నాయబ్‌తో పాటు కొత్త సీఎం లOదరూ ఎన్నికల్లో ఏం చేస్తారో చూడాలి. తమ సామాజిక వర్గాల ఓట్లను ఏ మేరకు మళ్లించగలరో చూడాలి. బలమైన ప్రతిపక్ష నేతలు లేనందున.. జాతీయవాదం, హిందూత్వం, సంక్షేమ పథకాలు ఉత్తరాదిన బీజేపీకి చాలావరకు ప్రయోజనం చేకూర్చినా.. ఇవే అంశాలు దక్షిణాదిలో వర్కౌట్ కావడం లేదు.
రెండో విడత అధికారం చేపట్టిన తర్వాత బీజేపీ తీసుకున్ననిర్ణయాలపై ప్రజల్లో కొంత అసంతృప్తి ఉంది. పెట్రోల్, గ్యాస్ ధరల రెట్టింపు, నిత్యావసర ధరలపై నియంత్రణ లేకపోవడం.. ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యం, నూతన వ్యవసాయ చట్టాలు, పెరిగిన రైతుల ఆత్మహత్యలు, తీవ్ర ద్రవ్యోల్బణం వంటి అంశాలు దేశ ప్రజలను తీవ్ర వేదనలోకి నెట్టివేశాయి. ఆ కారణంగా బీజేపీ ప్రాబల్యమున్న రాష్ర్టాల్లోనే ఆ పార్టీకి 2019 ఎన్నికలనాటి విజయం కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఆర్టికల్ 370 రద్దు, రామమందిర నిర్మాణం పూర్తి, చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల సాకారం, ఉమ్మడి పౌరస్మృతి అమలుకు ముందడుగు, రేషన్ పొడిగింపు తదితర అంశాలతో.. ఈసారి ఎన్నికలను బీజేపీ చాలా సానుకూలంగా ప్రారంభించింది. 2014, 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి చెప్పుకొనేందుకు ఇన్ని ‘అవకాశాలు’ లేవు.
Discussion about this post