తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. అటు కాంగ్రెస్.. ఇటు బీజేపీ బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్నాయి. ఆపార్టీ లోని అసంతృప్తులను గుర్తించి మంతనాలు జరుపుతున్నాయి. ఒకప్పుడు కేసీఆర్ ఎలా ఫిరాయింపులను ప్రోత్సహించారో ఇపుడు అదే పంథాను కాంగ్రెస్, బీజేపీ అనుసరిస్తున్నాయి.
కాంగ్రెస్ ,బీజేపీ నేతల ప్రయత్నాలు ఫలించి ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు బీబీ పాటిల్,రాములు ‘కారు’ దిగి కాషాయ కండువాలు కప్పేసుకోగా .. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ హస్తం పార్టీ లో చేరారు. బీఆర్ఎస్ లో మరింత మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారనే ప్రచారంకూడా జరుగుతోంది. వీరందరికి గాలమేసే ప్రక్రియ తెరవెనుక జోరుగా సాగుతోంది.
ఇప్పటికే పలువురు ముఖ్యనేతలు హస్తం పార్టీలోకి వచ్చేయగా.. తాజాగా ఖమ్మం నుంచి బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఏకైక స్థానం భద్రాచలం మాత్రమే. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన తెల్లం.. టికెట్ దక్కించుకుని గెలిచారు.ఈయన కూడా త్వరలోనే ‘కారు’ దిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని అంటున్నారు. బీఆర్ఎస్ తరఫున చేవెళ్ల నుంచి పోటీచేసి గెలిచిన యాదయ్య కూడా కాంగ్రెస్ లో చేరనున్నారు. యాదయ్య కూడా రేవంత్ ను కలిశారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు ఇదే బాటలో నడవనున్నారని అంటున్నారు.
మొత్తం మీద ఓ వైపు ఎంపీలు.. మరోవైపు ఎమ్మెల్యేలు.. ముఖ్యనేతలు వరుసగా ‘కారు’ దిగుతుండటం.. ఆ పార్టీ పెద్దలను కలవరపెడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటలేకపోయినా.. పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచి ప్రజలు తమవైపే ఉన్నారని చాటి చెప్పడానికి బీఆర్ఎస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఫిరాయింపులు ఇదేవిధంగా కొనసాగితే బీఆర్ ఎస్ కి ముందు ముందు కష్ట కాలమే అని విశ్లేషకులు అంటున్నారు. లోకసభ ఎన్నికలకు ముందే పరిస్థితి ఇలా ఉంటే తర్వాత ఎలాఉంటుందో చూడాలి.
Discussion about this post