టీ20 ప్రపంచకప్ 2024 బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను మంగళవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఎలాంటి సంచలనాలకు తావివ్వని బీసీసీఐ.. అందరూ ఊహించిన జట్టునే ఎంపిక చేసింది. మెగా టోర్నీలో భారత జట్టును రోహిత్ శర్మ నడిపించనుండగా.. హార్దిక్ పాండ్యా అతనికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. ఘోర రోడ్డు ప్రమాదంతో 15 నెలలుగా ఆటకు దూరమైన రిషభ్ పంత్.. తిరిగి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. రెండో వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్‌ను ఎంపిక చేసింది. దాంతో కేఎల్ రాహుల్‌కు నిరాశే ఎదురైంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు సూర్యకుమార్ యాదవ్, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఐపీఎల్లో నిలకడగా రాణిస్తున్న శివమ్ దూబేకు అవకాశం దక్కింది. స్పిన్ ఆల్రౌండర్లుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లను ఎంపిక చేసిన బీసీసీఐ.. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్‌లకు అవకాశం కల్పించింది. పేసర్లుగా అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ ఎంపికయ్యారు. శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్ స్టాండ్‌బై ఆటగాళ్లుగా ఎంపికయ్యారు. జూన్ 1 నుంచి అగ్రరాజ్యం అమెరికా వేదికగా టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. 29 వరకు జరగనున్న ఈ టోర్నీ ప్రధాన మ్యాచ్‌లకు వెస్టిండీస్ ఆతిథ్యం ఇవ్వనుంది.
Discussion about this post