ఉమ్మడి అనంతపురం జిల్లాలో మహిళలకు పట్టం కట్టాయి ప్రధాన రాజకీయ పార్టీలు. వైసీపీ, టీడీపీ పార్టీలు మహిళలకు ప్రాధాన్యతనిస్తూ మహిళా సాధికారత పెంపొందించే దిశగా ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు కేటాయించాయి. మహిళా ఓటర్లను ఆకర్షించే దిశగా పార్టీలు పావులు కదిపాయి. తెలుగుదేశం పార్టీ నుంచి పరిటాల సునిత,బండారు శ్రావణి,పల్లె సింధూరరెడ్డి,సవితమ్మలు ఎన్నికల బరిలో ఉండగా.. వైసీపీ నుంచి ఉషా శ్రీచరన్, కురుబ దీపిక, బోయ శాంతమ్మలు ఎన్నికల బరిలో నిలిచారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు పార్లమెంటు స్థానాలున్నాయి. వీటిలో హిందూపురం స్థానానికి వైసీసీ అభ్యర్థిగా బోయ శాంతమ్మను బరిలో దించింది వైసీపీ. పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులంతా ఈమె ప్రచారంలో పాల్గొన్నారు. ఈమెకు ప్రత్యర్థిగా టీడీపీ నుంచి గతంలో దశాబ్ద కాలంగా ఎమ్మెల్యేగా ఉన్న బీకే. పార్థసారధిని పోటీలో నిలిచారు. రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న పార్థసారధిపై శాంతమ్మ ఎంత మేరకు రాణించగలదో రానున్న ఎన్నికల ఫలితాల్లో తేలనుంది.
రాయలసీమలో రాప్తాడు నియోజకవర్గం కీలకమైనది. ఇది పరిటాల కుటుంబానికి కంచుకోటగా సాగుతూ వస్తోంది. పరిటాల ఫ్యామిలీ 25 సంవత్సరాలు ఇక్కడ అధికారంలో ఉంది. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి దాదాపుగా 25 వేల మెజారిటీతో గెలుపొందారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పరిటాల శ్రీరామ్ ఉన్నారు. ప్రస్తుతం జరిగిన ఈ ఎన్నికల బరిలో పరిటాల సునీత తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మూడో సారి పోటీలో నిలిచారు. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న పరిటాల రవి మరణానంతరం ఆయన సతీమణి పరిటాల సునీతకు రాప్తాడు టికెట్ కేటాయించింది టీడీపీ. 2009, 2014 ఎన్నికల్లో పరిటాల సునీత ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆమెకి మాతాశిశు సంక్షేమ శాఖ మంత్రిగా కూడా చేశారు.
పెనుగొండ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ, వైసీపీల అభ్యర్థులు ఒకే సామాజికవర్గానికి చెందిన వారు. గతంలో పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే డీకే పార్థసారథిని ఈసారి ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉంచారు. ఇక్కడ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా సవితమ్మను బరిలో దించింది టీడీపీ. 2019 ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన మూసా ఉషశ్రీ చరణ్‌కు మంత్రి పదవిని కట్టబెట్టింది వైసీపీ. ఈసారి పెనుగొండ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్నారు. సవితమ్మ స్థానికురాలుగా అందరికి సుపరిచితురాలు కావడం కలిసొచ్చే అంశం. వైసీపీ అభ్యర్థి స్థానికురాలు కాకపోవడంతో కొంత ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి ఉంది. మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండటంతో బరిలో నిలిచారు ఆమె. ఇరువరు మధ్య హోరాహోరీగా పోటీ ఉన్నప్పటికి ఎవరు విజయం సాధిస్తారో వేచి చూడాల్సి ఉంది.
సింగమల నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బండారు శ్రావణికి టికెట్ కేటాయించారు. 2019 ఎన్నికల్లోనూ ఆమె పోటీ చేసి వైసీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతిపై ఓడారు. ఈసారి వైసీపీ అభ్యర్థిని మార్చింది. టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులును బరిలో దించింది. ఈయన జొన్నలగడ్డ పద్మావతి భర్త ఆలూరు సాంబశివరెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడంతో టికెట్ దక్కినట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకత కొద్దిమెర శ్రావణికి కలిసివచ్చే అవకాశం ఉందంటున్నారు స్థానికులు. తనకు ఓటర్లు ఏమాత్రం మద్దతిచ్చారో రానున్న ఫలితాలు నిర్ణయించనున్నాయి.
పుట్టపర్తి నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కోడలు పల్లె సింధూర రెడ్డికి టికెట్ కేటాయించింది టీడీపీ. ఈ నియోజకవర్గంలో పల్లె కుటుంబానికి ప్రజలు దాదాపు మూడుసార్లు అవకాశం ఇచ్చారు. ఈసారి రఘనాథ్రెడ్డికి అవకాశం ఉన్నప్పటికీ మహిళలకు ప్రాధాన్యత అందించడలనే లక్ష్యంతో పుట్టపర్తి టికెట్‌ను సింధూరకి ఇచ్చారు. ఈమె కేరళ మాజీ డీజీపీ శంకర్‌రెడ్డి కుమార్తె. 2019 ఎన్నికల్లో తన మామ పల్లె రఘునాథ్‌రెడ్డి ప్రచారంలో చురుకుగా పాల్గొంది. ప్రత్యర్థిగా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి బలమైన నాయకుడిగా ఉన్నారు. అయితే ఆయనపై పలు ఆరోపణలు ఉండడం పల్లె సింధూర రెడ్డికి కలిసి వచ్చే అవకాశం ఉందంటూ నియోజకవర్గ ప్రజలు
చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ గట్టి పోటీ ఇద్దరి మధ్య నెలకొంది.
హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా కురుబ దీపికను ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దించారు. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీ కంచుకోటగా సాగుతోంది. 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో వేరే పార్టీ గెలవలేదు. ప్రతి ఎన్నికల్లోను టీడీపీ అభ్యర్థులు వరుస విజయాలు సాధిస్తున్నారు. మూడో సారి గెలుపే లక్ష్యంగా టీడీపీ నుంచి బరిలో దిగారు నందమూరి బాలకృష్ణ. నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు ఏకపక్షంగా ఉన్న ఈ నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి కురుబదీపిక ఎంత మేరకు రాణించగలదో వేచి చూడాల్సి ఉంది.
ఏదేమైనప్పటికీ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరు పార్టీలు కూడా మహిళలకు పెద్దపీట వేస్తూ రాజకీయాల్లో మహిళలకు అగ్రస్థానం కల్పిస్తూ మహిళా మణులకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా అవకాశాలు కల్పించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 32 మందిలో ఏడుగురు మహిళలకు అవకాశం దక్కడం ఇదే మొదటిసారి. ఉమ్మడి జిల్లాలో మహిళల ఎంతమేర రాణిస్తారో జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.
Discussion about this post