ఈ విశాల విశ్వంలో ఇప్పటి వరకు జీవరాశి ఉన్న గ్రహం భూమి మాత్రమే. ఇది ఎంతో అందమైన గ్రహం. పర్వతాలు, లోయలు, పీఠభూములు, సముద్రాలు, నదులు, సెలయేర్లు, అందమైన ప్రకృతి గల సుందర ప్రదేశం భూమి. ఈ భూమి మన ఇల్లు. మనం నివసిస్తున్న ఈ భూమి పై 2500 సంవత్సరం నాటికి జీవరాశి కనిపించక పోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ క్రమంలో భూమి కూడా మిగతా గ్రహాల మాదిరి మారిపోతుందని అంటున్నారు. ఎందుకిలా అవుతుంది ? దీని నివారణకు మనం ఏంచేయాలో తెలుసుకుందాం…
భూగోళానికి పొంచి ఉన్న ముప్పుపై, అవగాహన కల్పించడమే లక్ష్యంగా ‘ప్రపంచ ధరిత్రి దినోత్సవం’ ఏటా ఏప్రిల్ 22న జరుపుతున్నారు. 1970 నుంచి 192 దేశాల్లో దీన్ని అమలుచేస్తున్నారు. 2009 లో ఐక్యరాజ్య సమితి ఎర్త్ డే పేరును ‘మదర్స్ ఎర్త్ డే’ గా మార్చింది. రోజు రోజుకూ తీవ్రమవుతున్న ప్రపంచ వాతావరణ సంక్షోభంపై దృష్టి సారిస్తూ వాటి పరిష్కార దిశగా ప్రపంచ ధరిత్రి దినోత్సవం జరుపుతారు. అధిక జనాభా, జీవవైవిధ్యాన్ని కోల్పోవడం, ఓజోన్ పొర క్షీణించడం, పెరుగుతున్న పర్యావరణ సమస్యలపై ఆరోజు ప్రజలకు అవగాహన కల్పిస్తారు.
భూమిమీద, నీటిలో, ఆకాశంలో జీవించగల ప్రాణకోటికి ఆతిధ్యమివ్వగల వాతావరణ పరిస్థితులు భూమి మాత్రమే కల్పించింది. అందుకోసం భూమిని 70 శాతం నీళ్లతో అంటే సముద్రాలతో కప్పి ఉంచే విధంగా ఉంది. 3.8 బిలియన్ ఏళ్ల క్రితం జీవరాశి మనుగడకు ప్రాణం పోసింది భూమి మాత్రమే. సూర్యుడి నుంచి భూమికి కిరణాలు చేరడానికి 8 నిముషాలు పడుతుంది. భూ వాతావరణంలో 78 శాతం నైట్రోజన్, 21 శాతం ఆక్సిజన్, 1 శాతం ఆర్గాన్ , కార్బన్ డై ఆక్సైడ్, నియాన్ లు ఉంటాయి. ఇవి మనం ధారాళంగా గాలి పీల్చుకునే అవకాశాన్ని కలిగిస్తున్నాయి. అంతరిక్షం నుంచి వచ్చే రేడియేషన్, శిధిల పదార్థాలు భూమిని ఢీ కొట్టకుండా ఓజోన్ పొర అడ్డుకుంటుంది.
పరిశ్రమలు, వాహనాలు వల్ల కర్భన ఉద్గారాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దకుంటే భూతాపం పెరిగి సుభిక్షమైన అమెజాన్ నదీప్రాంతం బంజరు భూమిలా మారుతుంది. అమెరికా మధ్య పశ్చిమ ప్రాంతం, భారతదేశం కూడా ఉష్టమండల ప్రాంతంగా మారిపోతుందని శాస్త్రవేత్తల బృందం హెచ్చరిస్తోంది. ప్రస్తుతం భూగోళానికి కావాల్సిన 20 శాతం ఆక్సిజన్ ను అమెజాన్ అందిస్తోంది. అందుకే భూమికి ఊపిరితిత్తులు గా అమెజాన్ ని చెబుతుంటారు. రాబోయే ఉపద్రవాలను నివారించేందుకే ప్రపంచ దేశాలు పారిస్ అగ్రిమెంట్ ను రూపొందించారు.
Discussion about this post