దేశ రాజధాని న్యూఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన బిజీ బిజీగా సాగుతోంది. ఉదయం హోం మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు.

రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు.. విభజన హామీలు, పెండింగ్ ప్రాజెక్ట్‌లతోపాటు నిధుల కేటాయింపులపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే జల వనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నిధుల విడుదల, ఇతర నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన సాంకేతిక అనుమతులపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.
మధ్యాహ్నం 3 గంటలకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం సీఎంతో సమావేశం కానుంది. అమరావతి రాజధాని నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు అవసరమైన తక్కువ వడ్డీ రుణాల గురించి ఈ భేటీలో ప్రస్తావించనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థి తిని చక్కదిద్దేందుకు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల సహకారం కోరనున్నారు. అలాగే నీతి ఆయోగ్ సభ్యులు, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్. మహేంద్ర దేవ్ తో కూడా సీఎం చంద్రబాబు విడివిడిగా సమావేశమై రాష్ట్ర ప్రగతి ప్రణాళికలను వివరించనున్నారు.
ఇక, సాయంత్రం 4 గంటలకు హోటల్ తాజ్ ప్యాలెస్ లో జరగనున్నభారత పరిశ్రమల సమాఖ్య, సీఐఐ బిజినెస్ సమ్మిట్ లో చంద్రబాబు పాల్గొంటారు.

ఆంధ్రప్రదేశ్ ను పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చాలన్న సంకల్పంతో ఉన్న సీఎం, పారిశ్రామికవేత్తలను ఆకట్టుకునేందుకు ఈ వేదికను ఉపయోగించుకోనున్నారు. రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి దేశీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలకు వివరించనున్నారు. అలాగే, రాత్రికి సీఎం ఢిల్లీలోనే బస చేసి, రాష్ట్ర ప్రయోజనాల కోసం మరికొంత మంది కీలక నేతలతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది.
Follow for more updates
