వీసాల పేరుతో కోట్ల రూపాయల దందా.. అడ్డంగా బుక్కైన యూట్యూబర్ ? | Fraud Cases on Youtuber Nandu

సోషల్ మీడియా ఇన్‎ఫ్లూయెన్సర్స్ మోసాలు ఎక్కువైపోతున్నాయి. వారిపై ఉన్న అభిమానాన్ని అసరా చేసుకుని ఈజీగా చీట్ చేస్తున్నారు.

ముఖ్యంగా యూకే వీసా ప్రక్రియలో కీలకమైన COS పత్రాల విషయంలో ఈ భారీ స్కాం జరిగింది. యూకేలో లీగల్‌గా ఉద్యోగం చేయాలంటే అక్కడి ప్రభుత్వం ఆమోదించిన కంపెనీ నుండి COS లెటర్ తప్పనిసరి. ఈ స్కామ్‌లో భాగంగా నందు భర్త బాధితులకు నకిలీ COS పత్రాలను సృష్టించి ఇచ్చి, వాటి ద్వారా వీసాలు వచ్చేస్తాయని నమ్మించారు. ఒక్కొక్కరి నుండి లక్షలాది రూపాయలు వసూలు చేసి, తీరా వీసా అప్లికేషన్ స్టేజ్ లేదా ఇమ్మిగ్రేషన్ తనిఖీల వద్దకు వచ్చేసరికి ఆ పత్రాలు చెల్లనివిగా తేలడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. సుమారు 30 మందికి పైగా అమాయకులు ఈ నకిలీ వీసా వెరిఫికేషన్ వల్ల రోడ్డున పడ్డారని, దాదాపు కోట్లలో డబ్బు చేతులు మారిందని సమాచారం.

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో నందు కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేశారు. యూకే వీసా రెన్యువల్ పేరుతో తనను 15 లక్షల రూపాయల మేరకు మోసం చేశారంటూ బాధితుడి ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీసులు నటి రమా నందన, ఆమె భర్త మధుకర్, మధుకర్ తండ్రిపై కేసు నమోదు చేశారు. వెస్ట్ ఇబ్రహీంపట్నానికి చెందిన మామిళ్ళపల్లి శివక్రాంతి కుమార్ అనే యువకుడు గతంలో లండన్ లో ఉండేవాడు. అక్కడ అతని వీసా గడువు ముగిసే సమయం దగ్గరపడటంతో, దాన్ని ఎలాగైనా పొడిగించుకోవాలని భావించాడు.

ఈ క్రమంలోనే అతనికి ‘డెస్టినీ కన్సల్టెన్సీ’ నిర్వాహకులతో పరిచయం ఏర్పడింది. బాధితుడి అవసరాన్ని క్యాష్ చేసుకోవాలని చూసిన సదరు కన్సల్టెన్సీ యాజమాన్యం.. తమకు లండన్‌లో పెద్ద ఎత్తున లింకులు ఉన్నాయని నమ్మబలికారు. ఇండియా బ్రాంచ్‌లో కనుక డబ్బులు డిపాజిట్ చేస్తే ఎటువంటి రిస్క్ లేకుండా వీసా రెన్యూవల్ ప్రాసెస్ పూర్తి చేసి చేతిలో పెడతామని మాయమాటలు చెప్పారు. సెలబ్రిటీల బ్యాక్‌గ్రౌండ్ ఉండటం, పైకి పెద్ద కన్సల్టెన్సీ లాగా కలరింగ్ ఇవ్వడంతో శివక్రాంతి కుమార్ వారి మాటలను పూర్తిగా నమ్మేశాడు. ఆ నమ్మకంతోనే విడతల వారీగా సుమారు 15 లక్షల రూపాయల భారీ మొత్తాన్ని వారి ఖాతాల్లో వేశాడు.

డబ్బులు తీసుకుని నెలలు గడుస్తున్నా వీసా ప్రక్రియలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. దీనిపై బాధితుడు కన్సల్టెన్సీ నిర్వాహకులను గట్టిగా నిలదీయడంతో వారి అసలు స్వరూపం బయటపడింది. సమాధానం చెప్పాల్సింది పోయి.. ఎదురు తిరగడం, బెదిరింపులకు దిగడంతో తాను దారుణంగా మోసపోయానని శివక్రాంతి గ్రహించాడు. వెంటనే ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించి ఆధారాలతో సహా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన ఇబ్రహీంపట్నం పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో పక్కాగా మోసం జరిగినట్లు నిర్ధారించుకున్నాక.. డెస్టినీ కన్సల్టెన్సీపై పలు సెక్షన్ల కింద చీటింగ్ కేసు నమోదు చేశారు.

ఈ కేసులో కన్సల్టెన్సీ డైరెక్టర్ జాగర్లమూడి మధుకర్, ఆయన భార్య అయిన నటి నందు, అలాగే గుంటూరులో ఉంటున్న మధుకర్ తండ్రిని నిందితులుగా చేర్చారు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే కేసు వరకు వచ్చినది ఇదొక్కటే అయినా, వీరి మీద చాలా మంది సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తున్నారు.

Follow for more updates

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top