తండ్రి హ*త్య.. అన్న కిడ్నాప్..అయినా ప్రపంచకప్ హీరోగా నిలిచాడు | The Emotional Story of Aymen Hussein

తండ్రి, అన్న ఆర్మీలో సైనికులు.. కొన్నాళ్లకే ఆల్‌ఖైదా చేతిలో తండ్రి హతం.. ఆపై అన్నను ఐసిస్ టెర్రిరిస్టులు కిడ్నాప్ చేసిన ఘటన. ఓ వైపు ఆర్థిక కష్టాలు.. మరోవైపు కుటుంబ భద్రతపై ఆందోళన.. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ తన జట్టును ప్రపంచ కప్‌నకు చేర్చాడు.

మెగా టోర్నీలో తొలి మ్యాచ్‌లో ఓటమి ఎదురైనా.. అతడి పోరాట స్ఫూర్తి మాత్రం అద్వితీయం. అతడే ఇరాక్‌ ఫుట్‌బాల్ ప్లేయర్ అయెమెన్ హుస్సేన్..

ఫిఫా ప్రపంచ కప్‌లో ఇరాక్‌ గ్రూప్‌-i నుంచి బరిలోకి దిగింది. ప్రత్యర్థి నార్వే చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది. 4-1 తేడాతో నార్వే విజయం సాధించింది. ఇరాక్‌ తరఫున ఏకైక గోల్‌ను అయెమెన్‌ సాధించాడు. ఆటలో ఓడిపోవడం, గెలవడం సహజమే. కానీ, పోరాటమే అతి కీలకం. ఇందులో అయెమెన్‌ పెద్ద పెద్ద స్టార్లకు ఏమాత్రం తీసిపోడు. ఇరాక్‌ జట్టులోని ప్రతిఒక్కరూ శ్రమించి ఈ స్థాయికి వచ్చినవారే. కానీ, వీరిలో అయెమెన్ జీవితం భిన్నమైంది. అయెమెన్ తండ్రి ఇరాక్‌ ఆర్మీలో సైనికుడు.

ఆల్ హవిజా జిల్లాలోని ఆల్‌ సఫ్రాలో అయెమెన్ 1996లో జన్మించాడు. అతడికి 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు.. తన తండ్రిని అల్‌ఖైదా హత్య చేసింది. ఇంటి నిర్మాణం కోసం మెటీరియల్‌ను కొనుగోలు చేసేందుకు వెళ్లగా.. ఆయన్ను దారుణంగా చంపేసింది. ఇప్పటికీ ఆ ఇంటి నిర్మాణం పూర్తికాకపోవడం గమనార్హం. కెరీర్‌ ఆరంభంలో ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ కావాలని అయెమెన్ అనుకోలేదు. ఎలాగైనా డబ్బు సంపాదించి మధ్యలోనే ఆగిపోయిన ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని భావించాడట.

తండ్రి లేకపోవడంతో కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. అలాగే కుటుంబ భద్రత కూడా అయెమెన్‌ను ఆలోచనలో పడేసింది. సొంత ప్రాంతాన్ని వదిలివెళ్లాలని అనుకున్నాడు. కానీ, మిగతా కుటుంబ సభ్యులు నిరాకరించారు. అయెమెన్ అన్న ఆర్మీలో చేరడంతో పరిస్థితి కాస్త ఫర్వాలేదనిపించింది. ఇదంతా కొన్ని రోజుల ముచ్చటే. ఓ రోజు ట్రైనింగ్ క్యాంప్‌ నుంచి తిరిగివస్తుండగా అతడి అన్నను ఐసిస్‌ కిడ్నాప్‌ చేసినట్లు వార్త వచ్చింది.

దీంతో అప్పటివరకూ ఆడుతున్న ఫుట్‌బాల్‌ను వదిలేయాలని నిర్ణయానికొచ్చాడు. కానీ, అయెమెన్ తల్లి మాత్రం అలా జరగనివ్వకుండా అడ్డుకోగలిగారు. కలను నిజం చేసుకోవాలని ఉద్బోధించడంతో మళ్లీ మైదానంలోకి దిగాడు. ఇరాక్‌లోని పెద్ద ఫుట్‌బాల్ క్లబ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. అతడి టాలెంట్‌కు క్లబ్‌లు ఆర్థికసాయం అందించాయి. దీంతో ఇరాక్‌కు అద్భుతమైన ప్లేయర్‌గా మారాడు. 40 ఏళ్లలో తొలిసారి ప్రపంచ కప్‌ టోర్నీకి అర్హత సాధించడంలో అయెమెన్‌ కీలక పాత్ర పోషించాడు.

అయెమెన్ కష్టాలు తీరిపోయాయని అనుకుంటే పొరపాటే. ఇరాక్‌ తరఫున అత్యుత్తమ ప్లేయర్‌ అయినప్పటికీ.. వరల్డ్ కప్‌ కోసం అతడికి అమెరికాలో అడుగుపెట్టడం కష్టంగా మారింది. ఇమిగ్రేషన్ అధికారులు అతడిని ఎయిర్‌పోర్ట్‌లోనే ఏడు గంటలపాటు ఆపేశారు. అమెరికాలో అడుగుపెట్టే ముందు అతడి ఫోన్‌ చెక్ చేశారు. ఇప్పుడు నార్వేపై అమెరికా గడ్డ వేదికగా తొలి గోల్‌ కొట్టి లక్షల మంది ఇరాక్‌ అభిమానులను సంతోషపెట్టాడు. జట్టు ఓడినా.. అయెమెన్‌ ఆటతీరు మాత్రం అందరినీ ఆకట్టుకుంది.

Follow for more updates

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top