సై అంటే సై.. కాంగ్రెస్ VS బీఆర్ఎస్..వేడెక్కిన తెలంగాణ రాజకీయం | BRS VS Congress | 4sidestv

BRS VS Congress : గురుకుల పాఠశాలల టెండర్లలో రూ. 2 వేల కోట్ల భారీ కుంభకోణం జరిగిందంటూ బీఆర్ఎస్ చేసిన ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఈ అంశంపై బహిరంగ చర్చకు రావాలంటూ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు విసురుకున్న సవాళ్లు, ప్రతిసవాళ్లతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఉద్రిక్తతలకు వేదికైంది.

BRS VS Congress : సై అంటే సై.. కాంగ్రెస్ VS బీఆర్ఎస్..వేడెక్కిన తెలంగాణ రాజకీయం

టెండర్ల అవినీతిపై బీఆర్ఎస్ నేతలతో చర్చకు తాము సిద్ధమంటూ కాంగ్రెస్ మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్లు గన్ పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్దకు చేరుకున్నారు. బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులలో ఎవరైనా సరే.. ఇక్కడికి లేదా సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు వచ్చి చర్చించవచ్చని సవాల్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన రూ. 7.30 లక్షల కోట్ల అప్పుల లెక్కలను తాము నిరూపిస్తామని, ఒకవేళ తమ ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజీనామాలకు కూడా వెనుకాడబోమని మంత్రులు స్పష్టం చేశారు. అయితే, తాము రెండు గంటల పాటు వేచి చూసినా బీఆర్ఎస్ నేతలు రాకుండా మొహం చాటేశారని మండిపడ్డారు.

మరోవైపు మంత్రుల సవాల్‌ను స్వీకరిస్తూ మాజీ మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు తెలంగాణ భవన్ నుండి గన్ పార్క్ వైపు బయలుదేరారు. కానీ, పోలీసులు వారిని ముందుకు వెళ్లకుండా తెలంగాణ భవన్ వద్దే అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య జరిగిన తోపులాటలో హరీశ్ రావు కిందపడిపోయారు. శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు హరీశ్ రావుతో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌లను అదుపులోకి తీసుకుని కాంచన్ బాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Follow for more updates

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top