పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ధరల పెంపునకు వ్యతిరేకంగా ముజఫరాబాద్ తో పాటు పలు నగరాల్లో ప్రజలు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ క్రమంలో నిరసనకారులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన భీకర ఘర్షణల్లో పలువురు ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడ్డారు.

అనేక మందిని పోలీసులు అరెస్టు చేశారు. మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని, ప్రభుత్వం కావాలనే వివరాలను బయటకు రానివ్వడం లేదని జేఏఏసీతో పాటు స్థానికులు ఆరోపిస్తున్నారు. పౌర సమాజ కూటమిగా ఏర్పడ్డ జేఏఏసీ.. పీవోకేలో ఆర్థిక, రాజకీయాలకు సంబంధించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. స్థానిక అసెంబ్లీలో కశ్మీరేతర పాకిస్థానీయులకు 12 సీట్లు రిజర్వ్ చేయాలని పాక్ చట్టం చేసింది. అలా చేయడం వల్ల స్థానికుల హక్కులు దెబ్బతింటాయంటూ జేఏఏసీ ఉద్యమిస్తోంది. దీంతో ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ పాక్ ప్రభుత్వం ఆ సంస్థపై నిషేధం విధించింది. అందుకు వ్యతిరేకంగా నిరసనగా పీవోకేలో నిరసనలు చెలరేగాయి.
భద్రతా దళాలు నిరసనకారులపై పెల్లెట్స్, టియర్ గ్యాస్, లైవ్ బుల్లెట్లతో విరుచుకుపడ్డాయి. దీంతో ఆగ్రహించిన నిరసనకారులు ఆటోమేటిక్ రైఫిళ్లు, పెట్రోల్ బాంబులతో ఎదురుదాడికి దిగినట్లు స్థానిక కమిషనర్ సర్దార్ వహీద్ ఖాన్ తెలిపారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇరువర్గాల ఘర్షణలో ఆరుగురు నిరసనకారులు మరణించినట్లు చెబుతున్నప్పటికీ, వాస్తవానికి మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని స్థానిక ప్రజలు, జేఏఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. జులై 27న పీవోకే అసెంబ్లీకి జరగబోయే ఎన్నికలలో మొత్తం 45 స్థానాలకు గాను 12 స్థానాలను శరణార్థుల కోసం రిజర్వ్ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జేఏఏసీ నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతోపాటు ఈ ప్రాంతంలో తీవ్రమైన విద్యుత్ కొరత, విపరీతమైన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఇంటర్నెట్ నిలిపివేత, స్థానిక వనరులను పాకిస్తాన్ దోచుకుంటోందంటూ కొంతకాలంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి.
పౌర హక్కుల కోసం పోరాడుతున్న ఒక సంస్థను తీవ్రవాద ముఠాగా ముద్రవేసి నిషేధించడాన్ని పాకిస్తాన్ మానవ హక్కుల సంఘం తీవ్రంగా తప్పుపట్టింది. మరోవైపు, పీవోకేలో పాక్ భద్రతా దళాలు సాగిస్తున్న ‘తీవ్ర పోలీసు అనాగరికతను’ భారతదేశ విదేశాంగ శాఖ ఖండించింది. అక్కడి ప్రజలపై పాక్ చూపుతున్న క్రూరత్వం, సాగిస్తున్న అకృత్యాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్ అణచివేత ధోరణిని ప్రశ్నించాలని, పీవోకేలో దారుణాలకు ఆ దేశాన్ని బాధ్యురాలిని చేయాలని అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. మరోపక్క పీవోకేలో ఆందోళనకారులపై పాకిస్థాన్ కాల్పులు జరపడాన్ని నిరసిస్తూ బ్రిటన్‌లోని బ్రాడ్‌ఫోర్డ్‌లో గల పాక్ రాయబార కార్యాలయం ముందు పలువురు కశ్మీరీలు ఆందోళన నిర్వహించారు.
నిరసనకారులపై సైన్యాన్ని ప్రయోగించడాన్ని విమర్శించారు. పీవోకేలో పెద్దఎత్తున సాగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనపై బ్రిటన్ ప్రభుత్వం దౌత్యపరమైన జోక్యం చేసుకోవాలంటూ 30 మంది బ్రిటిష్ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖకు లేఖ రాశారు.
- పీవోకేలో పాక్ రక్తపాతం
- సైన్యం కాల్పుల్లో 30 మందికి పైగా మృతి.. 200 మందికి గాయాలు
- ఎన్నికల కోటా, ఆర్థిక ఇబ్బందులపై కొన్నాళ్లుగా జనం నిరసనలు
- ఆందోళనలను అణచివేసేందుకు పాక్ దళాల కాల్పులు
- మృతుల సంఖ్య చాలా ఉంటుందంటున్న స్థానికులు
- అల్లర్లు చెలరేగిన పీవోకేలోని ముజఫరాబాద్‌లో..
- వాహనాల్లో గస్తీ నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది
