కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై ఏడు రోజులు గడిచినా ఆచూకీ లభించకపోవడంతో ఉత్కంఠ కొనసాగుతోంది.

బాలిక కోసం పోలీసులు, అటవీశాఖ, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, రెవెన్యూ అధికారులు, గ్రామస్థులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఆమె అదృశ్యమైన సమయంలో వెంట వెళ్లినట్లు భావిస్తున్న పెంపుడు కుక్క తిరిగి కనిపించడం కేసు దర్యాప్తులో కీలక పరిణామంగా మారింది. ఆ కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చిన అధికారులు దాని కదలికలను పరిశీలిస్తూ కొండ ప్రాంతాల్లో ప్రత్యేక గాలింపు నిర్వహిస్తున్నారు. మరోవైపు తమ పాపను ఎవరో తీసుకెళ్లి ఉండొచ్చని జ్ఞానేశ్వరి తల్లి అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
చిన్నారి ఆచూకీకి సంబంధించిన విశ్వసనీయ సమాచారం అందించిన వారికి లక్ష రూపాయలు బహుమతి అందజేస్తామని పోలీసుశాఖ ఇప్పటికే ప్రకటించింది. తల్లిదండ్రుల ఆవేదన, గ్రామస్థుల ఆందోళన మధ్య జ్ఞానేశ్వరి ఎక్కడనే ప్రశ్నకు సమాధానం కోసం రాష్ట్రం మొత్తం ఎదురుచూస్తోంది.
మరోపక్క వ్యవసాయ కూలీలైన తల్లిదండ్రులు మొదట గ్రామస్తుల సహాయంతో స్వయంగా గాలించినప్పటికీ ఎలాంటి సమాచారం లభించలేదు. దీంతో వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. చిన్నారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు రోజురోజుకూ ఆందోళన చెందుతుండగా, గ్రామంలోనూ విషాద వాతావరణం నెలకొంది. చిన్నారిని గుర్తించేందుకు పోలీసులు భారీ స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు 10 ప్రత్యేక బృందాలు, SDRF సిబ్బంది, అటవీ శాఖ, రెవెన్యూ శాఖ, అగ్నిమాపక సిబ్బంది కలిసి పరిసర ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు.
జీడితోటలు, కొండ ప్రాంతాలు, చెరువులు, నీటి గుంతలు, అటవీ ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. డ్రోన్లు, డాగ్ స్క్వాడ్‌లు, సీసీటీవీ ఫుటేజ్‌లను కూడా వినియోగిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చిన్నారిని ఎవరైనా అపహరించి ఉండవచ్చనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. చిన్నారితో పాటు కనిపించకుండా పోయిన కుటుంబ పెంపుడు కుక్క కొన్ని రోజుల తర్వాత తిరిగి ఇంటికి చేరుకుంది. ఆ కుక్క చిన్నారి తల్లి భవానిని అడవి వైపు లాగడానికి ప్రయత్నించడంతో పోలీసులు ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా గాలింపు చేపట్టారు. అయినప్పటికీ ఇప్పటివరకు చిన్నారి ఆచూకీ లభించలేదు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలంతా చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నారు.
మరోవైపు భర్త స్నేహితులపై చిన్నారి తల్లి అనుమానాలు వ్యక్తం చేస్తోంది. తన పాపను భర్త స్నేహితులే తీసుకెళ్లి ఉండొచ్చని తల్లి అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు.. చిన్నారి తండ్రి స్నేహితులను విచారించారు. వారి నుంచి కూడా ఎలాంటి సమాచారం లభించనట్లు సమాచారం.
చుట్టుపక్కల గ్రామాల్లో సీసీటీవీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద కదలికలు, చిన్నారిని ఎవరైనా తీసుకెళ్లారా అనేదానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గడిచిన ఏడు రోజులుగా చిన్నారి ఆచూకీ కోసం వందలాది మంది పోలీసులు మోహరించి గాలిస్తున్నప్పటికీ… చిన్నారి జాడ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిడ్డ కోసం తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఏది ఏమైనా చిన్నారి జ్ఞానేశ్వరి క్షేమంగా తిరిగి రావాలని ఆశిద్దాం.
- జ్ఞానేశ్వరి జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యుల ఆందోళన
- దర్యాప్తులో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై పోలీసుల కసరత్తు
- సీసీ కెమెరాలు, టెక్నాలజీ ఆధారంగా గాలించినా దొరకని క్లూ
- పెంపుడు కుక్కకు జీపీఎస్ ట్రాకర్
- చిన్నారిని ఎవరైనా కిడ్నాప్ చేశారా?
- జంతువులు దాడి చేశాయా? అన్న కోణంలో విచారణ
- చిన్నారి మిస్సింగ్‌ను చాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు
Follow for more updates
