రూ. 142 కోట్ల నెక్లెస్ తో మెరిసిన మేఘ కృష్ణ రెడ్డి భార్య

న్యూయార్క్‌లో ప్రతి ఏటా అత్యంత వైభవంగా జరిగే మెట్ గాలా వేదికపై ఈసారి కూడా హైదరాబాద్ గర్వించదగ్గ రీతిలో మెరిసింది.

ప్రముఖ వ్యాపారవేత్త, పరోపకారి సుధా రెడ్డి, మెట్ గాలా 2026లో తన అద్భుతమైన ఆహార్యంతో అంతర్జాతీయ ఫ్యాషన్ ప్రపంచాన్ని అబ్బురపరిచారు. కేవలం ఖరీదైన దుస్తులు ధరించడమే కాకుండా.. తన అలంకరణ ద్వారా భారతీయ సంస్కృతిని, ముఖ్యంగా తెలంగాణ మూలాలను ప్రపంచానికి చాటిచెప్పారు. సుధా రెడ్డి ఈ వేడుక కోసం ధరించిన దుస్తులకు ది ట్రీ ఆఫ్ లైఫ్ అని పేరు పెట్టారు.

ఇది కేవలం ఒక డ్రెస్ మాత్రమే కాదు.. భారతీయ కళాకారుల అలుపెరుగని శ్రమకు ఒక నిదర్శనం. సుమారు 90 మంది నిపుణులైన కళాకారులు రాత్రింబవళ్లు 3,459 గంటల పాటు శ్రమించి ఈ దుస్తులను రూపొందించారు. దాదాపు 3,000 ఏళ్ల నాటి ప్రాచీన మచిలీపట్నం కలంకారీ కళను ఆధునిక ఫ్యాషన్‌తో మిళితం చేస్తూ మనీష్ మల్హోత్రా దీనిని డిజైన్ చేశారు. ఇందులో ఉపయోగించిన జర్దోజీ, మెటల్ వర్క్ అడుగడుగునా భారతీయతను ఉట్టిపడేలా చేశాయి.

రాయల్ బ్లూ కలర్ బాడీస్, ఏడు మీటర్ల పొడవైన నెమలి పింఛం లాంటి ట్రైన్ సుధా రెడ్డికి ఒక రాచరికపు రూపాన్ని ఇచ్చాయి. ఇక వీపు భాగంలో ఇత్తడి, రాగి, వెండితో చేసిన కల్పవృక్షం డిజైన్ అందరినీ మంత్రముగ్ధులను చేసింది. సుధా రెడ్డి ధరించిన ఆభరణాల విలువ వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సుమారు 125 కోట్ల రూపాయల విలువైన ఆభరణాలతో ఆమె మెరిసిపోయారు.

మెడలో ధరించిన విక్టోరియన్ డైమండ్ నెక్లెస్‌లో 550 క్యారెట్ల భారీ వయొలెట్-బ్లూ టాంజానైట్ రత్నం హైలైట్‌గా నిలిచింది. దీనిని క్వీన్ ఆఫ్ మెరెలాని అని పిలుస్తారు.దీనికి తోడు రాజస్థాన్ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే పోల్కీ వజ్రాల ఉంగరాలు ఆమె చేతులకు మరింత అందాన్ని ఇచ్చాయి.

మేఘా ఇంజనీరింగ్ అధినేత పి.వి. కృష్ణా రెడ్డి భార్య అయిన సుధా రెడ్డి, అంతర్జాతీయ వేదికపై తన మూలాలను అస్సలు మర్చిపోలేదు. ఆమె దుస్తుల్లో తెలంగాణ రాష్ట్ర చిహ్నాలైన పాలపిట్ట, జమ్మి చెట్టు గుర్తులను అత్యంత చాకచక్యంగా పొందుపరిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హైదరాబాద్ నాకు పునాది. నా సాంస్కృతిక మూలాలను ప్రపంచానికి అర్థమయ్యే రీతిలో, ఒక గ్లోబల్ ఫ్యాషన్ భాషలో ప్రదర్శించడమే నా ఉద్దేశ్యం అని ఎంతో గర్వంగా చెప్పారు.2021లో మెట్ గాలాలో అడుగుపెట్టిన సుధా రెడ్డి, 2024లోనూ సందడి చేశారు.

ఇప్పుడు 2026లో తన మూడవ ప్రదర్శనతో మెట్ గాలా వేదికపై హాట్రిక్ సాధించారు. భారతీయ ప్రాచీన కళలు ప్రపంచ దేశాలకు సరికొత్త ఫ్యాషన్ పాఠాలు చెప్పగలవని సుధా రెడ్డి తన ఆహార్యం ద్వారా మరోసారి నిరూపించారు. మనీష్ మల్హోత్రా అన్నట్లుగా.. ఇది కేవలం ఒక దుస్తుల ప్రదర్శన కాదు, భారతీయ కళాకారుల ఆత్మ మరియు జ్ఞాపకాల సముదాయమని చెప్పాలి.

Follow for more updates

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top