PM మోడీ బంగారం పై సంచలన వ్యాఖ్యలు…

కరోనా మహమ్మారి విజృంభన తర్వాత ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసులో సమస్యలు వచ్చాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వివిధ దేశాల మధ్య యుద్ధాలతో చమురు ధరలు భారీగా పెరిగాయని, బంగారం ధరలు పెరుగుతున్నాయని గుర్తు చేశారు. ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను నిలిపివేయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.

బంగారం దిగుమతులు తగ్గితే విదేశీ మారక ద్రవ్యం పెరుగుతుందని చెప్పారు. అయితే, ప్రధాని మోదీ సూచన మేరకు మనం ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయడం ఆపేస్తే దాని ద్వారా కేంద్రానికి వచ్చే లాభం ఏమిటి? ఆయన అలా ఎందుకు అన్నారు? ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి లాభం జరుగుతుంది?.. ఏడాది పాటు పసిడి కొనుగోళ్లకు దూరంగా ఉండాలని ఆయన చేసిన విజ్ఞప్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా పెరుగుతున్న ఇంధన ధరలు, సరఫరా గొలుసులో అంతరాయాలు దిగుమతులపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థలపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఇలాంటి తరుణంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రధాని మోదీ సూచనలో ఉన్న ముఖ్య ఉద్దేశం. ఆదివారం రోజున హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రపంచ సంక్షోభం మధ్య సామూహిక ప్రజా భాగస్వామ్యం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.

బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలు వంటి అత్యవసరం కాని విదేశీ మారక ద్రవ్య లావాదేవీలను తగ్గించుకోవాలని కోరారు. వీలైనంత మేరకు విదేశీ మారక నిల్వలను పొదుపు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలను మానుకోవాలని కోరారు.

ఇంధన వినియోగాన్ని తగ్గిచడం, ప్రజా రావాణాను ఉపయోగించడం, ఇంటి నుంచి పని చేసే విధానాలు, సహజ వ్యవసాయం, స్వదేశీ ఉత్పత్తులకు మద్దతు వంటి చర్యలతో పాటు ఆర్థిక దేశభక్తిని ప్రోత్సహించే విస్తృత ప్రయత్నంలో భాగంగా ప్రధాని మోదీ ఈ విజ్ఞప్తి చేసినట్లు స్పష్టమవుతోంది. ప్రపంచంలోనే బంగారం అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. దేశీయ డిమాండ్ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడి ఉంది. బంగారం దిగమతులకు డాలర్లలో చెల్లింపులు జరుగుతాయి. కాబట్టి భారీ ఎత్తున బంగారం కొనుగోలు చేయడంతో భారత దేశ దిగుమతుల బిల్లు, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడిని పెంచుతుంది. బంగారం వంటి విచక్షణతో కూడిన దిగుమతులను తగ్గించడం ద్వారా రూపాయిపై ఒత్తిడిని తగ్గించవచ్చు. దీంతో వాణిజ్య సమతుల్యత మెరుగవుతుంది. ప్రపంచం అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్న తరుణంలో విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి ఇది సహాయపడుతుంది. బంగారాన్ని ఆర్థికవేత్తలు డెడ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా పిలుస్తారు. బంగారం బిస్కెట్లు లేదా నగలు కొనుగోలు చేసి లాగర్‌లో పెడితే అది కేవలం నీ దగ్గర మాత్రమే ఉంటుంది. అది దేశ ఉత్పత్తికి లేదా ఉద్యోగ కల్పనకు ఉపయోగపడదు. అదే బంగారం కొనుగోలు చేయకుండా ఆ డబ్బును బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టినప్పుడు ఆ డబ్బును బ్యాంకులు పరిశ్రమలకు అప్పుగా ఇస్తాయి. తద్వారా కొత్త ఫ్యాక్టరీలు వస్తాయి, ఉద్యోగాలు లభిస్తాయి.దేశ ప్రజలు ఫిజికల్ గోల్డ్ కాకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సావరీన్ గోల్డ్ బాండ్లను కొనుగోలు చేసినట్లయితే ప్రభుత్వానికి చాలా మేలు జరుగుతుంది. ప్రభుత్వానికి చాలా తక్కువ వడ్డీకే నిధులు సమకూరుతాయి. ఆ నిధులను రోడ్లు, రైల్వేలు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఉపయోగిస్తుంది. మన దేశంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు,పండగలు అంటే మొదటగా బంగారమే గుర్తుకు వస్తుంది. ఒక ఏడాది పాటు పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం కొనుగోళ్లను ఆపడం అనేది చాలా కష్టం. సామాన్యుడికి బంగారం అంటే ఒక ఆపద్బాంధవుడు లాంటిది. కష్టమొస్తే తాకట్టు పెట్టుకోవడానికి పనికొచ్చే ఏకైక ఆస్తి. కొనుగోళ్లు ఆపితే లక్షలాది మంది స్వర్ణకారులు ఇబ్బంది పడవచ్చు. అయితే, ఫిజికల్ గోల్డ్ కాకుండా ప్రజలు డిజిటల్ గోల్డ్ లేదా సావరీన్ గోల్డ్ బాండ్ల వైపు మళ్లితే బంగారం కొన్నట్లే అవుతుంది. గతంలో యుద్ధాల సమయంలో ప్రజలు తమ బంగారాన్ని దేశం కోసం ఇచ్చిన చరిత్ర మనది. ఇప్పుడు ఆర్థిక యుద్ధం కోసం ఏడాది పాటు కొత్త బంగారం కొనకుండా ఉండడం అనేది దేశం పట్ల గౌరవాన్ని చూపే అవకాశం. అయితే, ఇవన్నీ ప్రాక్టికల్‌గా జరగడం కొంత మేర సాధ్యం కాకపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

Follow for more updates.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top