నేడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాలను మూసివేశారు. వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం, బాసర, కీసర సహా అన్ని ప్రధాన ఆలయాలతో పాటు చిన్న ఆలయాల్లో ప్రత్యేక పూజల అనంతరం మూసివేశారు.
చంద్రగ్రహణం అనంతరం సాయంత్రం 7 గంటలకు సంప్రోక్షణ చేసి, తిరిగి ఆలయాలను తెరవనున్నారు.

సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రధానాలయంతో పాటు ఉపాలయాలు, అనుబంధ ఆలయాలను ప్రధానార్చకులు, ఆలయ అధికారులు మూసివేశారు. మంగళవారం ఉదయం 3 గంటలకు ఆలయాన్ని తెరిచి స్వామి వారి సుప్రభాత సేవ, తిరువాధన, భాలభోగం, ఉదయం ఆరగింపు చేపట్టారు.

నిజాభిషేకం చేపట్టి స్వామి, అమ్మవార్ల ఉభయ దర్శనాలకు అనుమతినిచ్చారు. ఉదయం 7 గంటలకు స్వామి వారి ప్రధానాలయానికి ద్వారా బంధనం గావించి, మూసి వేశారు. రేపు ఉదయం 3 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ, శుద్ధి పూజలు నిర్వహించి స్వామి వారి నిత్య కైంకర్యాలు, ఉభయ దర్శనాలను కొనసాగిస్తామని ఆలయ ప్రధానఅర్చకులు భట్టర్ సురేంద్రాచార్యులు తెలిపారు.
చంద్రగ్రహణం సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి ఆలయాన్ని మూసివేశారు. మంగళవారం ఉదయం 8.:30 గంటలకు ఆలయం తలుపులు మూసివేశారు. రాత్రి 7 గంటలకు ఆలయ శుద్ధి సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం రాత్రి 8.30 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనాలు కల్పించనున్నారు.

కేతుగ్రస్త సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉదయం 7 గంటలకు బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి అమ్మవారి ఆలయంతో పాటు ఉప ఆలయాలను మూసివేశారు.
తెల్లవారుజామున అమ్మవారి ఆలయంతో పాటు ఉప ఆలయాలలో అర్చకులు వేద పండితులు వేద మంత్రాలతో అభిషేక, అర్చన, హారతి పూజలు చేసి అమ్మవార్లకు నివేదన అనంతరం ఆలయ ద్వారాలను మూసివేశారు. ఈ కార్యక్రమంలో అలయ ఏ ఈ ఓ శ్రీనివాస్, ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ పూజరి,ఆలయ హోమ్ గార్డ్స్, సిబ్బంది పాల్గొన్నారు.
Follow Us For More Updates
