నందికొట్కూరులో వైసీపీ జెండా.. బైరెడ్డి వ్యూహం పనిచేసిందా?
తన సొంత గ్రామమైన పాత ముచ్చుమర్రిలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్లిన వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. దీంతో వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఓటు వేయడానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం ఏంటని సిద్ధార్థ్ రెడ్డి ప్రశ్నించారు.
తనను మాత్రమే కాకుండా మండలానికి చెందిన పలువురు వైసీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారని ఆరోపించారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యేలు శిల్పా రవి, శిల్పా చక్రపాణి రెడ్డిలను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నోటీసులు ఇవ్వకుండానే తమను నిర్బంధించారని శిల్పా రవి ఆరోపించారు. వైసీపీ జనరల్ ఏజెంట్లను కూడా అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.
బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారు?
ఇక ఈ ఘటనపై నందికొట్కూరు వైసీపీ కార్యాలయంలో పార్టీ సమన్వయకర్త డాక్టర్ దారా సుధీర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఓటు వేయడానికి వెళ్లిన నాయకుడిని హౌస్ అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని మండిపడ్డారు.కూటమి నేతలు రిగ్గింగ్‌కు పాల్పడేందుకు వీలుగా వైసీపీ ముఖ్య నాయకులను ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అరెస్ట్ చేసిన నాయకులను వెంటనే విడుదల చేసి వారి గ్రామాలకు పంపాలని డిమాండ్ చేశారు.
లేకపోతే జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ముచ్చుమర్రిలో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని నిర్బంధించిన పోలీసులు, అక్కడే ఉన్న ఎంపీ బైరెడ్డి శబరిని ఎందుకు వదిలేశారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.మొత్తంగా పరిషత్ ఎన్నికల పోలింగ్ వేళ నంద్యాల, కర్నూలు జిల్లాల్లో వైసీపీ నేతల హౌస్ అరెస్టులు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
