అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాడిపత్రిలో వైసీపీ తలపెట్టిన ‘వెన్నుపోటు రెండేళ్లు’ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో పోలీసులు, పెద్దారెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. శాంతిభద్రతల దృష్టా పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకుని అనంతపురం తరలించారు. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైన సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలన్నింటినీ నెరవేర్చడంతో బైక్ ర్యాలీ చేపడుతున్నట్లు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. పెద్దఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు బైక్ ర్యాలీ కార్యక్రమానికి రావాల్సిందిగా పిలుపునిచ్చారు. దీంతో వైసీపీ, టీడీపీ పోటాపోటీగా కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో తాడిపత్రిలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉండటంతో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ముందుస్తుగా పోలీసుల అనుమతి తీసుకోకుండా ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమాన్ని చేపడుతుండటంతో పాటు శాంతిభద్రతలకు భంగం వాటిల్లే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నారంటూ పెద్దారెడ్డిని పోలీసులు ముందుగా గృహనిర్బంధం చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ కార్యక్రమాన్ని చేసి తీరుతామని మాజీ ఎమ్మెల్యే ప్రకటించారు. దీంతో కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాడిపత్రిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
- అనంతపురం: తాడిపత్రిలో టెన్షన్..టెన్షన్
- వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు రెండేళ్ల కార్యక్రమం
- మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం
- కార్యక్రమం వాయిదా వేసుకోవాలన్న పోలీసులు
- వాయిదా వేసేది లేదన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి
- ఇంటి దగ్గర నుంచి ర్యాలీ చేపట్టిన పెద్దారెడ్డి
- పెద్దారెడ్డి ర్యాలీని అడ్డుకున్న పోలీసులు,వాగ్వాదం
- పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Follow for more updates
