KTR, Harish Rao Arrest: కేటీఆర్, హరీష్‌రావును పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు?
మేడ్చల్ జిల్లా హకీంపేట వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. కాలినడకన ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కి వెళ్తుండగా కేటీఆర్, హరీష్ రావులను అరెస్ట్ చేశారు పోలీసులు. అలాగే, మిగిలిన ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకున్నారు. హరీష్‌రావును జవహర్‌నగర్ పీఎస్‌కు తరలిస్తుండగా.. కేటీఆర్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలను బోయినపల్లి పీఎస్‌కు తరలిస్తున్నారు.
ఎర్రవల్లి ఫాంహౌస్ వద్ద భారీగా డప్పుల మోతతో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ ఎస్సీ నేతలు సిద్ధమవ్వగా.. ఆ ప్రాంతమంతా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎక్కడికక్కడ కాంగ్రెస్ శ్రేణుల్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాంగ్రెస్ శ్రేణులను నిర్బంధిస్తున్నారు. మరోవైపు అసెంబ్లీ నుంచి ఎర్రవల్లికి బయల్దేరిని కేటీఆర్, హరీష్ రావుల కాన్వాయ్ లతో పాటు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
హకీంపేట వద్ద వాహనాలను అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాము కేసీఆర్ ను కలిసేందుకు వెళ్తున్నామని, నిరసనలకు కాదని చెప్పినా పోలీసులు వాహనాలను అనుమతించలేదు. దీంతో వాహనాలు దిగి.. కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ తదితరులు నడుచుకుంటూనే ఫాంహౌస్ వైపు పయనమయ్యారు.
