తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు.. ప్రజలకు భారీ శుభవార్త!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న ఈ భేటీలో పలు కీలక ప్రాజెక్టులు, రాబోయే ప్రధాన కార్యక్రమాలపై ప్రభుత్వం విస్తృతంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనుంది.
డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ సన్నాహాలపై కేబినెట్లో ప్రధానంగా చర్చించనున్నారు. భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రముఖ అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల ఆహ్వానం, వేదిక ఏర్పాట్లపై మంత్రులతో సీఎం సమీక్షించనున్నారు.
ఇందిరమ్మ చీరలు, రూ.5 లక్షల బీమా.. తెలంగాణ కేబినెట్ కీలక ప్రకటనలు!
ఇక, ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై కేబినెట్లో చర్చించనున్నట్లు తెలిసింది. జిల్లా, మండల, గ్రామస్థాయిల్లో తాగునీరు, సాగునీటి ఎద్దడి తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక సాయంపై ఒత్తిడి తేవడం లాంటి అంశాలపై చర్చించనున్నారు. వీటితో పాటు పలు శాఖల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
రాష్ట్రంలో జరగనున్న ఖేలో ఇండియా క్రీడా పోటీల నిర్వహణ ఏర్పాట్లు, మౌలిక వసతుల కల్పనపై సమీక్ష జరపనున్నారు. ప్రజా ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకమైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి పండుగ వాతావరణంలో దీపావళి వేడుకల నిర్వహణపై చర్చించనున్నారు.
సాగునీటి ప్రాజెక్టుల పురోగతిలో భాగంగా కీలకమైన తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణ సాధ్యాసాధ్యాలు, తదుపరి చర్యలపై దృష్టి సారించనున్నారు. రాబోయే రోజుల్లో ఎల్నినో ప్రభావం వల్ల తాగునీరు, సాగునీటికి ఎలాంటి ఎద్దడి కలగకుండా ముందస్తుగా చేపట్టాల్సిన ప్రణాళికలు, రిజర్వాయర్లలో నీటి నిల్వల నిర్వహణపై కేబినెట్ సమగ్రంగా చర్చించనుంది. శాఖాపరమైన ఇతర కీలక అంశాలతో పాటు ప్రజా సంక్షేమ పథకాల అమలుపై కూడా ఈ భేటీలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశముంది.
