రైతుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయంటూ SMSలు.. అసలు నిజం ఇదే!
రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ అయ్యాయంటూ సెల్ఫోన్లకు వచ్చిన మెసేజ్‌లతో అన్నదాతలు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. తెలంగాణ ప్రభుత్వం.. రైతుల బ్యాంకు అకౌంట్లలో రైతు భరోసా డబ్బులు జమ అయినట్లు బుధవారం ఉదయం చాలా మంది రైతులకు ఎస్ఎంఎస్లు రావడంతో అయోమయానికి గురయ్యారు.
అయితే.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు విడుదల కాలేదని వ్యవసాయ శాఖ స్పష్టం చేయడంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ అనధికారిక మెసేజ్‌ల వ్యవహారంపై అలర్ట్ అయిన వ్యవసాయ శాఖ.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
రైతు భరోసా పేరుతో కొత్త మోసం? సైబర్ క్రైమ్ రంగంలోకి!
రైతు భరోసా పథకం కింద ఎకరానికి ఏడాదికి రూ.12 వేల చొప్పున నిధులు జమ అయినట్లు కొంతమంది రైతులకు మెసేజ్‌లు అందాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుతో సందేశాలు రావడంతో చాలామంది రైతులు వాటిని నిజమని నమ్మారు. వెంటనే తమ బ్యాంకు అకౌంట్లను పరిశీలించగా ఎలాంటి నగదు జమ కాలేదని గుర్తించారు. దీంతో రైతులు ఒకరికొకరు ఫోన్ చేసి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. కొందరు ఈ మెసేజ్‌లను వాట్సాప్ గ్రూపుల్లోనూ షేర్ చేశారు.
ఈ వ్యవహారంపై స్పందించిన వ్యవసాయ శాఖ అధికారులు.. రైతు భరోసా నిధులు ఇంకా విడుదల కాలేదని స్పష్టం చేశారు. సాంకేతిక సమస్య కారణంగా ఇలాంటి మెసేజ్‌లు వచ్చాయంటూ మొదట వ్యవసాయ శాఖ అధికారులు వివరణ ఇచ్చారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైతులకు ఇలాంటి మెసేజ్‌లు వెళ్లినట్లు గుర్తించడంతో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించారు.
ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో.. వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి. గోపీ.. తెలంగాణ డీజీపీ, సైబర్ క్రైమ్ విభాగం ఉన్నతాధికారులకు లేఖ రాశారు. రైతు భరోసా పథకం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2,73,128 మంది రైతులకు అనధికారికంగా ఎస్ఎంఎస్లు పంపినట్లు సీడీఏసీ పోర్టల్ రిపోర్ట్ ద్వారా తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. అయితే.. ఈ మెసేజ్‌లను వ్యవసాయ శాఖ పంపించలేదని.. రైతులకు ఇలాంటి మెసేజ్‌లు పంపేందుకు ఎలాంటి అనుమతి కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు.
రైతులకు అధికారిక సమాచారాన్ని చేరవేసేందుకు వ్యవసాయ శాఖ సీడీఏసీ ఎస్ఎంఎస్ సర్వీస్ పోర్టల్‌ను వినియోగిస్తోందని వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి. గోపీ వివరించారు. అయినప్పటికీ ప్రస్తుతం రైతులకు అందిన మెసేజ్‌లు వ్యవసాయ శాఖ అధికారిక పోర్టల్ ద్వారా పంపినవి కావని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ పేరును దుర్వినియోగం చేసి ఉండవచ్చని.. ఎస్ఎంఎస్ కమ్యూనికేషన్ వ్యవస్థల్లోకి అనధికారికంగా ప్రవేశించడం, ఇతర ఎస్ఎంఎస్ గేట్‌వేల ద్వారా మెసేజ్‌లు పంపించడం జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని వ్యవసాయ శాఖ సైబర్ క్రైమ్ పోలీసులను కోరింది. ఈ మెసేజ్‌లు ఏ గేట్‌వే నుంచి వచ్చాయి.. వాటిని పంపిన వ్యక్తులు, సంస్థలు, ఏజెన్సీలు ఎవరు.. అనే వివరాలను గుర్తించాలని విజ్ఞప్తి చేసింది. సీడీఏసీ ఎస్ఎంఎస్ సర్వీస్ పోర్టల్‌తో పాటు ఇతర ఎస్ఎంఎస్ గేట్‌వేలలో ఏమైనా అనధికారిక ప్రవేశం, దుర్వినియోగం జరిగిందా అనే కోణంలోనూ దర్యాప్తు చేయాలని కోరింది.
అలాగే ఈ మెసేజ్‌ల ప్రసారానికి సంబంధించిన లాగ్‌లు, సెండర్ ఐడీలు, ఐపీ చిరునామాలు వంటి టెక్నికల్ ఆధారాలను పరిశీలించాలని లేఖలో పేర్కొన్నారు. ఈ వ్యవహారం వెనుక ఉన్న బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి తప్పుడు మెసేజ్‌ల వల్ల రైతుల్లో గందరగోళం ఏర్పడటమే కాకుండా ప్రభుత్వ పథకాలపై, వ్యవసాయ శాఖపై ప్రజలకు ఉన్న విశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
