అమెరికాలో నల్గొండ యువతి అదృశ్యం.. 5 రోజులైనా ఆచూకీ లేదు!
భవిష్యత్తుకు బాటలు వేసుకునేందుకు ఆ యువతి అమెరికా వెళ్లింది. ఉన్నత చదువులు చదువుతోంది.. పార్ట్‌టైం ఉద్యోగం చేస్తోంది. ఉన్నత విద్య పూర్తి చేసి జీవితంలో స్థిరపడుతుందని తల్లిదండ్రులు ఆశించారు. అంతలోనే ఏమైందో తెలియదు.. ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. ఉన్నట్టుండి కుమార్తె అదృశ్యం కావడంతో ఆ కుటుంబంలో ఆందోళన మొదలైంది. రోజులు గడుస్తున్నా ఆచూకీ లేకాపోవడంతో తల్లిదండ్రులకు ఇప్పుడు కంటిమీద కునుకు లేకుండా పోయింది. అమెరికాలో యువతి మిస్సింగ్ మిస్టరీ ఇప్పుడు కలకలం రేపుతోంది.
నల్లగొండ జిల్లా కనగల్ మండలం శాబ్దులాపురం గ్రామానికి చెందిన కోయ యాదగిరిరెడ్డి, రూప దంపతుల ఏకైక కుమార్తె శ్రీజ రెడ్డి. చిన్నప్పటి నుంచే ఉన్నత చదువులు చదివి జీవితంలో మంచి స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో ముందుకు సాగింది. ఈ క్రమంలో ఏడాది క్రితం అమెరికా వెళ్లింది. ప్రస్తుతం బోస్టన్లోని యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్‌లో చదువుకుంటూ పార్ట్‌టైం ఉద్యోగం కూడా చేస్తోంది.అయితే నవంబర్ 2వ తేదీ రాత్రి సుమారు 9.45 గంటల సమయంలో డోర్చెస్టర్ ప్రాంతంలోని ఎడిసన్ గ్రీన్‌లో ఉన్న తన నివాసం నుంచి శ్రీజ బయటకు వెళ్లింది.
ఆ తర్వాత తిరిగి రాకపోవడంతో స్నేహితులు ఆందోళన చెందారు. ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో నవంబర్ 3న పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో నవంబర్ 4న బోస్టన్ పోలీస్ డిపార్ట్మెంట్ మిస్సింగ్ పర్సన్ అలర్ట్ విడుదల చేసింది. శ్రీజ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఆమె మొబైల్ ఫోన్ చివరి లొకేషన్ ఆధారంగా కార్సన్ బీచ్, హార్బర్ పాయింట్ పరిసరాల్లో గాలిస్తున్నట్లు సమాచారం. కళ్లముందు పెరిగిన ఏకైక కుమార్తె ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి ఇలా అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు యాదగిరిరెడ్డి, రూప కన్నీరుమున్నీరవుతున్నారు.
తమ కుమార్తె క్షేమంగా తిరిగి రావాలని బంధువులు, గ్రామస్థులు ప్రార్థిస్తున్నారు.మరోవైపు శ్రీజ అదృశ్యమైన విషయం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దృష్టికి వెళ్లింది. స్పందించిన మంత్రి అమెరికా ఎంబసీ అధికారులతో మాట్లాడి శ్రీజ ఆచూకీ కనుగొనేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చొరవ చూపించారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలుగు విద్యార్థిని ఆచూకీ ఎక్కడ? అసలు శ్రీజకు ఏమైంది? ఆమె క్షేమంగా తిరిగి వస్తుందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు అందరినీ కలవరపెడుతున్నాయి.
