కళ్లముందే దట్టమైన పొగలు.. పరుగులు తీసిన ప్రయాణికులు!
పంజాబ్‌లో భారీ రైలు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కర్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో నాలుగు బోగీలు పూర్తిగా మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం.
శుక్రవారం సారాయ్ బంజారా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. అమృత్సర్ నుంచి న్యూ జల్పాయ్గురి వెళ్తున్న కర్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు నంబర్ 12508లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నాలుగు బోగీలకు మంటలు వ్యాపించగా.. ఐదో కోచ్‌తో పాటు ఇంజిన్‌కు కూడా మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది.
మంటలను గమనించిన ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే చైన్ లాగి రైలును నిలిపివేసి ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే మంటలు వేగంగా వ్యాపించడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం.
ప్రమాద సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, స్థానికులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. మరోవైపు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
ఇక ప్రాథమిక దర్యాప్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నది ఇంకా అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.
కదులుతున్న రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
