ఒంగోలు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
ఒంగోలు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.. తిరుమల దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న కుటుంబం ప్రమాదానికి గురైంది.. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, నూతన దంపతులు ప్రాణాలతో బయటపడ్డారు..ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని పెళ్లూరు వద్ద జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఈ ఘోర ప్రమాదం జరిగింది..బాపట్లకు చెందిన ఆరుగురు కుటుంబ సభ్యులు మారుతి సుజుకి ఎర్టిగా కారులో తిరుపతి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్నారు..
శనివారం ఉదయం 6 గంటల 10 నిమిషాల సమయంలో పెళ్లూరు సమీపంలోని ఫేస్ ఇంజనీరింగ్ కాలేజ్ దాటిన తర్వాత కారు ఒక్కసారిగా అదుపుతప్పింది..తెల్లవారుజామున డ్రైవర్ ప్రవీణ్ నిద్రమత్తులోకి జారుకోవడంతో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న కల్వర్టు గోడను బలంగా ఢీకొట్టింది.. అనంతరం పల్టీలు కొడుతూ పక్కనే ఉన్న కాలువలోకి బోల్తా పడింది..
తిరుమల దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణం
ఈ ప్రమాదంలో డ్రైవర్ ప్రవీణ్‌తో పాటు వెంకట్రావు, సుజాత, సీతామహాలక్ష్మి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.. కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది..అయితే అదే కారులో ప్రయాణిస్తున్న నూతన దంపతులు శ్రీతేజ, కైవల్య మాత్రం అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు..
వీరిని వెంటనే 108 అంబులెన్స్‌లో ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు..సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.. క్రేన్ సాయంతో కాలువలో పడిన కారును బయటకు తీశారు..
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు..తిరుమల దర్శనం చేసుకుని సంతోషంగా ఇంటికి తిరిగి వస్తున్న కుటుంబంలో ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.. బాపట్లలోని మృతుల కుటుంబ సభ్యుల ఇళ్ల వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి..ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..
