అక్వాన్ తుఫాను ప్రభావం.. పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక!
బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుఫాను క్రమంగా బలపడుతోంది.. ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తోంది. ఇప్పటికే తుఫాను తీవ్రత పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.ప్రస్తుతం చెన్నైకి 590 కిలోమీటర్లు, మచిలీపట్నం, విశాఖపట్నానికి 620 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉంది.గడిచిన ఆరు గంటల్లో గంటకు 3 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న అక్వాన్.. రేపు సాయంత్రానికి అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
Watch Here for Full Story : https://youtu.be/KS5LCwzQsco
బంగాళాఖాతంలో బలపడిన అక్వాన్ తుఫాను
శుక్రవారం మధ్యాహ్నం నెల్లూరు, విశాఖపట్నం మధ్య తుఫాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉంది. గరిష్టంగా 145 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.తుఫాను ప్రభావంతో గురువారం, శుక్రవారం ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
రైతులు కూడా వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.మరోవైపు తెలంగాణలోనూ గురువారం, శుక్రవారం అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.అక్వాన్ తుఫాను మరింత బలపడుతున్న నేపథ్యంలో ఏపీ, తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అధికారుల సూచనలు పాటించాలి.
తుఫాను సమయంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపానుగా బలపడిన నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించారు. మందగమనంగా అక్వాన్ గంటకు 3 కి.మీ వేగంతో కదులుతోందని అధికారులు తెలిపారు. ఎల్లుండి (నవంబర్ 20) మధ్యాహ్నానికి తీరం దాటే అవకాశం ఉందని.. తీరం దాటే సమయంలో 100-120 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో 48 గంటలపాటు రాష్ట్ర యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు. అత్యవసర సహాయక చర్యల కోసం 13 NDRF, 11 SDRF, స్థానిక అగ్నిమాపక బృందాలను సిద్ధంగా ఉంచామన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అనిత తెలిపారు. ఉత్తరాంధ్రపై తుపాను ప్రభావం ఎక్కువగా ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తీర ప్రాంత ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దన్నారు. వర్షాలు, ఈదురుగాలుల దృష్ట్యా రైతులు వ్యవసాయ పనుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధికారిక హెచ్చరికలను మాత్రమే నమ్మాలి, వదంతులు నమ్మవద్దని స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అధికార యంత్రాంగం సూచించిన వెంటనే పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని సూచించారు.
అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం టోల్-ఫ్రీ నంబర్లు 112, 1070, 18004250101 లను సంప్రదించాలని హోంమంత్రి తెలిపారు. విద్యుత్ అంతరాయం, చెట్లు కూలడం, నీటి నిల్వ, ఇతర సమస్యలపై మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 కు తక్షణమే సమాచారం ఇవ్వాలన్నారు. అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు 24/7 పని చేయాలని ఆదేశించారు. ప్రజలు ఏ అవసరం ఉన్నా స్థానిక అధికారులను సంప్రదించాలని సూచించారు. కూలిన విద్యుత్ స్తంభాలు, తెగిపడిన వైర్ల వద్దకు వెళ్లొద్దని హోంమంత్రి అనిత హెచ్చరించారు.
