వైఎస్ జగన్ పాదయాత్ర
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పాదయాత్ర 2.Oకి సిద్ధమయ్యారు. ఈ మేరకు 2027లో ప్రారంభించనున్న పాదయాత్రపై కీలక ప్రకటన చేశారు. 2027 సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో పాదయాత్ర ప్రారంభిస్తానని వైఎస్ జగన్ ప్రకటించారు. పర్చూరు నియోజకవర్గ కేడర్‌తో జరిగిన భేటీలో తాను చేపట్టబోయే పాదయాత్ర మీద స్పష్టత ఇచ్చారు. వైఎస్ జగన్ 2019 ఎన్నికలకు ముందు స్ట్రాటజీని మరోసారి ఫాలో అవుతున్నారా?..
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి పాదయాత్రకు సిద్ధమయ్యారు. తాను పాదయాత్ర చేయబోతున్నట్లు గతంలోనే ప్రకటించిన జగన్.. తాజాగా ముహూర్తం ఖరారు చేశారు. 2027లో తన పాదయాత్ర ప్రారంభమవుతుందని స్పష్టత ఇచ్చారు.. వచ్చే ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో పాదయాత్ర ప్రారంభిస్తానని ప్రకటించారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ వైసీపీ కార్యకర్తల సమావేశంలో జగన్ తన పాదయాత్రపై స్పష్టత ఇచ్చారు. గతంలో వైఎస్ జగన్ 2017 నుంచి 2019 వరకు పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే.. అనంతరం 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు 2029 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు రెండోసారి పాదయాత్ర చేపట్టబోతున్నారు.
జగన్ పాదయాత్ర 2.0
వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో 2017 నుంచి 2019 వరకు పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్ర 2017 నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమై.. 2019 జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగిసింది. మొత్తం 341 రోజుల పాటు సుమారు 3వేల 648 కిలోమీటర్ల మేర ఈ సుదీర్ఘ యాత్ర సాగింది. ఈ ప్రజా సంకల్ప యాత్రలో జగన్ దాదాపు 2 కోట్ల మంది ప్రజలను ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిశారు. ఈ యాత్ర సందర్భంగా నవరత్నాలు పేరుతో ప్రకటించిన సంక్షేమ పథకాలతో 2019 ఎన్నికల్లో YSRCPకి ఘన విజయం దక్కింది. వైఎస్ జగన్ మరోసారి అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారు.
2027 నుంచి ప్రారంభమయ్యే పాదయాత్రలో వైఎస్ జగన్ ప్రజల సమస్యల్ని తెలుసుకుని.. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను వారికి వివరిస్తారని వైసీపీ చెబుతోంది. 2017లో జగన్ చేపట్టి ప్రజా సంకల్ప యాత్ర కూడా దాదాపు రెండేళ్ల పాటూ కొనసాగింది.. ఈసారి కూడా జగన్ 2027 నుంచి 2029 వరకు ప్రజల మధ్యే ఉంటారనే సంకేతాలు ఇచ్చారు. వచ్చే ఏడాది ప్రారంభించనున్న పాదయాత్రకు సంబంధించిన షెడ్యూల్, రూట్‌మ్యాప్‌లపై త్వరలోనే స్పష్టత వస్తుందంటున్నారు. మొత్తం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2029 ఎన్నికలే టార్గెట్‌గా పాదయాత్ర 2.Oకు సిద్ధమయ్యారు.
అలాగే, ఈ పాదయాత్ర ద్వారా ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను ఒడిసిపట్టి, ఎన్నికల మూడ్‌ను పార్టీకి అనుకూలంగా మార్చనున్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలు, పరిపాలనా లోపాలను ఎండగడుతూనే, తమ గత ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు గుర్తుచేయడం ప్రధాన ఎజెండాగా పాదయాత్రను సాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పాదయాత్రతో ఓటమితో నిరాశలో ఉన్న కార్యకర్తలు, నాయకుల్లో కొత్త ఉత్సాహం నింపాలని భావిస్తున్నారు. గతంలో చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రకు వచ్చిన పాజీటీవ్ రెస్పాన్స్‌నే మళ్లీ తీసుకురావాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు.
