హైదరాబాద్‌లో విషాదం.. భర్త పనికి వెళ్లగానే ఇంట్లో ఏం జరిగింది?
హైదరాబాద్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సెల్‌ఫోన్ ఎక్కువగా చూస్తున్నావంటూ తల్లి మందలించడంతో ఓ వివాహిత తీవ్ర మనస్తాపానికి గురైంది. చివరకు క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంది. ఇద్దరు చిన్నారులను అనాథలుగా వదిలి ఆమె తీసుకున్న నిర్ణయం కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.
హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం ఎల్లమ్మ రంగాపురం గ్రామానికి చెందిన కృష్ణయ్య, అలివేలు దంపతుల రెండో కుమార్తె లక్ష్మీదేవి.
25 ఏళ్ల లక్ష్మీదేవికి ఏడేళ్ల క్రితం నల్గొండ జిల్లా నాంపల్లి మండలం టీపీగౌరారం గ్రామానికి చెందిన లక్ష్మణ్‌తో వివాహమైంది.వివాహం అనంతరం ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఈ కుటుంబం హయత్‌నగర్‌లోని బొమ్మలగుడి సమీపంలో నివాసం ఉంటోంది. లక్ష్మణ్ పెయింటర్‌గా పనిచేస్తుండగా.. లక్ష్మీదేవి తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. వీరికి ఏడేళ్ల కుమార్తె, మూడేళ్ల కుమారుడు ఉన్నారు.
భర్త బయటకు వెళ్లిన కొద్దిసేపటికే విషాద ఘటన
అయితే ఇటీవల లక్ష్మణ్ తన భార్య కోసం ఈఎంఐ పద్ధతిలో కొత్త సెల్‌ఫోన్ కొనిచ్చాడు. అప్పటి నుంచి లక్ష్మీదేవి ఎక్కువ సమయం ఫోన్ చూస్తోందని కుటుంబ సభ్యులు గుర్తించారు.ఈ క్రమంలో గురువారం తల్లి అలివేలు ఆమెను మందలించింది. ఎప్పుడూ ఫోన్ చూస్తూ ఇంటి పనులను పట్టించుకోవడం లేదని, ఫోన్ పక్కన పెట్టి ఏదైనా పని చేసుకోవాలని సూచించింది. దీంతో తల్లి మాటలకు లక్ష్మీదేవి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.
ఇక శుక్రవారం ఉదయం భర్త లక్ష్మణ్ పనికి వెళ్లిన తర్వాత మరో విషాదం చోటుచేసుకుంది. ఏడేళ్ల కుమార్తెను పాఠశాలకు పంపకుండా, మూడేళ్ల కుమారుడితో కలిసి టీవీ ముందు కూర్చోబెట్టింది. ఆ తర్వాత గదిలోకి వెళ్లింది.కొద్దిసేపటి తర్వాత కుటుంబ సభ్యులు గమనించగా.. లక్ష్మీదేవి ప్రాణాలు కోల్పోయి కనిపించింది. దీంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న హయత్‌నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఏడేళ్ల కుమార్తె, మూడేళ్ల కుమారుడిని వదిలి తల్లి మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. చిన్నపాటి కుటుంబ కలహాలు, మనస్తాపాలు ఎంతటి విషాదానికి దారితీస్తాయో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.
