సీజేపీ ఆందోళనలో ఉద్రిక్తత.. ధ్రువ్ రాఠీని అదుపులోకి తీసుకున్న పోలీసులు!
ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన భారీ నిరసన ప్రదర్శన కారణంగా రాజధాని పూర్తిగా దద్దరిల్లిపోతోంది. జంతర్ మంతర్ వద్ద నిరసనలకు పిలుపునివ్వడంతో ఢిల్లీ నగరమంతా పోలీసులు భారీ భద్రత మధ్య ఒక కోటలా మారిపోయింది. రాజధాని సరిహద్దులన్నిటితో పాటు, సెంట్రల్ ఢిల్లీలోనూ, నిరసనకారులు గుమిగూడే అవకాశం ఉన్న ప్రతి కూడలిలోనూ భారీగా బలగాలను మోహరించారు.
ముఖ్యంగా ఆగ్నేయ ఢిల్లీలోని మోహన్ ఎస్టేట్ పారిశ్రామిక ప్రాంతంలో బారికేడ్లతో పాటు రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్‌ను కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. నిషిద్ధ ప్రాంతాల వైపు ఎలాంటి వాహనాలు వెళ్లకుండా ఈ చర్యలు తీసుకున్నారు. మోహన్ కోఆపరేటివ్ ఎస్టేట్ ప్రాంతంలో పోలీసులు భారీ కాపలా కాస్తూ, ప్రతి కార్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేసిగానీ ముందుకు వెళ్లనివ్వట్లేదని సమాచారం..
ఢిల్లీ CJP ఆందోళనలో హైడ్రామా.. ధ్రువ్ రాఠీ విషయంలో ఏం జరిగింది?
SIR, ఫామ్ 6 మార్పుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ సీజేపీ ఈ భారీ ఆందోళనకు పిలుపునిచ్చింది. సీజేపీ తరఫున ఇలాంటి ఆందోళన జరగడం ఇది రెండోసారి. మరోవైపు, ఈ నిరసనలను అణచివేయడానికి పోలీసులు ముందుస్తు చర్యలు చేపట్టారు. ధ్రువ్ రాఠీ, అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రంకా లు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవగానే విమానం నుంచి దిగుతుండగా పోలీసులు నేరుగా అదుపులోకి తీసుకున్నారు. వీళ్లతో పాటు సీజేపీకి చెందిన మరికొందరు ముఖ్య నేతలు, నగరవ్యాప్తంగా దాదాపు 500 మందికి పైగా నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
శాంతిభద్రతలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఏకంగా 20 వేలకు పైగా పోలీసులను, CAPF బలగాలను రంగంలోకి దించింది. ఈ నిరసనల ఎఫెక్ట్ రవాణా రంగంపై కూడా గట్టిగానే పడింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ను పోలీసులు కోరారు. దీంతో డీఎంఆర్సీ ఏకంగా 45 మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను మూసివేసింది. అలాగే శనివారం ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య న్యూఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్లకు చేరుకోవాల్సిన ఇతర రాష్ట్రాల రైళ్లు, లోకల్ ట్రైన్లు కలిపి మొత్తం 250కి పైగా రైళ్లను రద్దు చేశారు.
మరోపక్క ఢిల్లీలో ల్యాండ్ అయిన వెంటనే అభిజీత్ దిప్కే, సౌరభ్ దాస్, రాంకాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏకంగా ఫ్లైట్ లోపలే పోలీసులు ఈ యాక్షన్ తీసుకోవడం గమనార్హం. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ తలవంచబోం అంటూ పోలీసుల అదుపులో ఉన్న దీప్కే, సౌరభ్, రాంకాలు నినదించారు. ఇక, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టనున్న భారీ నిరసన ప్రదర్శనకు ముందే ఢిల్లీ పోలీసులు అప్రమత్తమై ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీతో సహా ఇప్పటివరకు సుమారు 150 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఫౌండర్ అభిజీత్ దిప్కే ముంబైలోని తన ఇల్లు నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకోగానే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇలా ఎక్కడికక్కడ ప్రదర్శనకారులను పోలీసులు ఏరివేస్తూ నిర్బంధిస్తున్నారు.
ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆందోళనకారులు జంతర్ మంతర్ చేరుకోకుండా ఢిల్లీ పోలీసులు గట్టి నిఘా పెట్టారు. ఢిల్లీ సరిహద్దులన్నింటి వద్ద భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. వెళ్లే ప్రతి వాహనాన్ని ఆపి మరీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎవరి మీదైనా అనుమానం వస్తే చాలు, క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే అదుపులోకి తీసుకుంటున్నారు. మరోవైపు, ఈ నిరసనను అణచివేయడానికి ఢిల్లీ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
