భారత జట్టు మహా సమరానికి సిద్ధమైంది. వన్డే వరల్డ్ కప్‌ను తృటిలో చేజార్చుకున్న టీమిండియా టీ20 ప్రపంచకప్ లక్ష్యంగా వేట మొదలుపెట్టనుంది. గ్రూప్-ఏలో భాగంగా ఐర్లాండ్‌తో గురువారం తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన హాట్ ఫేవరేట్. అయితే మ్యాచ్ కంటే తుదిజట్టులో ఏఏ ఆటగాళ్లకు స్థానం దక్కుతుందనే ఉత్కంఠ మొదలైంది.
మునుపెన్నడూ లేని విధంగా పొట్టి కప్‌లో ఇరవై దేశాలు బరిలోకి దిగుతున్నాయి. నాలుగు గ్రూప్‌లుగా విడిపోయి సూపర్-8 బెర్త్ కోసం పోటీపడుతున్నాయి. తదుపరి దశకు భారత్ చేరుకోవడం సులువే. గ్రూప్-ఏలో టీమిండియాతో పాటు ఐర్లాండ్, పాకిస్థాన్, కెనడా, అమెరికా జట్లు ఉండగా…. పాకిస్థాన్ మినహా మిగిలిన జట్లన్నీ పసికూనలే. అయితే ప్రారంభ మ్యాచ్‌లో అమెరికా, కెనడా ఆడిన తీరుతో అన్ని జట్లూ అలెర్ట్ అయ్యాడు. పొట్టి ఫార్మాట్లో ఏ జట్టును తేలికగా తీసుకోవద్దనే అభిప్రాయానికి వచ్చాయి. టీ20 ఫార్మాట్లో ఐర్లాండ్‌తో భారత్ ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడగా…అన్నింట్లోనూ టీమిండియాదే విజయం. అయితే గురువారం మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న న్యూయార్క్ డ్రాప్ ఇన్ పిచ్‌కు తగ్గట్లుగా జట్టు కూర్పును సిద్ధం చేయాలని రోహిత్-ద్రవిడ్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఐర్లాండ్‌ను తేలికగా తీసుకోకుండా పూర్తి సామర్థ్యంతో బరిలోకి దిగాలని భావిస్తున్నారు. యశస్వీ జైస్వాల్‌ను ఓపెనర్‌గా బరిలోకి దించాలని, కోహ్లినే వన్‌డౌన్‌లో కొనసాగించాలని ప్లాన్ చేస్తున్నారు.
ఐపీఎల్-2024లో ఓపెనర్‌గా వచ్చిన కోహ్లి పరుగుల వరద పారించాడు. 15 మ్యాచ్‌ల్లో 741 పరుగులతో ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లినే ఓపెనర్‌గా దించాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. కానీ జట్టు కూర్పు గత సంప్రదాయంగానే కొనసాగించాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ నాలుగు, అయిదు స్థానాల్లోనూ… మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లుగా శివమ్ దూబె, హార్దిక్ పాండ్య బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చుకునేలా ప్రణాళికలు రచిస్తోంది. సంజు శాంసన్‌ను బెంచ్‌కే పరిమితం చేయాలని భావిస్తోంది. ఇక బుమ్రాతో మరో ఫాస్ట్ బౌలర్‌గా సిరాజ్‌కు బదులుగా అర్షదీప్ సింగ్‌ను ఎంపిక చేయాలని ప్లాన్ చేస్తోంది. బంగ్లాదేశ్ వార్మప్ మ్యాచ్‌లో అర్షదీప్ సత్తాచాటగా..అతని ప్రదర్శన పట్ల రోహిత్ సంతృప్తిగా ఉన్నాడు. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాకు స్పిన్ బాధ్యతలు కట్టబెట్టనున్నారు.
Discussion about this post