ఎండాకాలం దేశమంతా దాహం కేకలు వినబడతాయి. ఎక్కడా గుక్కెడు నీళ్లు దొరుకుతాయా అని ఎదురు చూస్తుంటారు. పల్లెలు నగరాలన్న తేడా లేకుండా అన్నిచోట్ల ఇదే పరిస్థితి. వర్షాకాలం కాస్త వర్షాలు కురవంగానే నగరాలలోని రోడ్లన్నీ చెరువులుగా మారతాయి. జనజీవనం అస్తవ్యస్థం అవుతుంది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలను రక్షించడానికి బోట్లలో వస్తాయి. పల్లెలన్నీ వరద రక్షిత శిబిరాల్లోకి వెళతాయి. ప్రతి ఏటా ఇదే తంతు.. వర్షాలు పడగానే ఆ నీటిని ఒడిసిపట్టి ఎండాకాలం నీటి ఎద్దడి లేకుండా చేయలేమా ? సైన్సు ఎంతగానో పురోభివృద్ది చెందింది కదా అయినప్పటికీ పరిస్థితులను బేరీజు వేసుకోవడంలోనూ.. ముందు జాగ్రత్తలు తీసుకోవడంలోనూ ఎందుకు విఫలం చెందుతున్నాం ?
తన్నీర్ .. తన్నీర్ అనే తమిళ పొలిటికల్ డ్రామాను రచించి, దర్శకత్వం వహించిన కె బాలచందర్ 1981లో ఆ సినిమాను విడుదల చేశారు. ఆ సినిమాలో నీళ్ల కోసం గ్రామస్తులు పడే బాధలు, అధికారులు, రాజకీయనాయకుల వద్దకు వారు తిరిగినప్పటికీ ఫలితం లేకుండా పోవడం .. చివరికి వారంతా కలసి కాలువ తవ్వుతుండగా పొలిటికల్ అండ్ బ్యూరోకాట్లు అడ్డుకోవడంతో కథ ముగుస్తుంది. ఇదే పరిస్థితి ఇప్పటికీ ఎదురవుతోంది. పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. ఎండాకాలంలో నీటిఎద్దడికి చర్యలు తీసుకున్నట్లు.. వర్షాకాలం వరద పరిస్థితులు ఎదుర్కొంటానికి సమాయత్తం అయినట్లు ప్రభుత్వాలు యాక్ట్ చేస్తాయి తప్ప శాశ్వత నివారణకు ఒక్క ప్రయత్నమూ లేదు..మన సివిల్ ఇంజనీర్ల సహాయ సహకారాన్ని అందిపుచ్చుకోవడంలో ప్రభుత్వాలు దారుణంగా విఫలం అవుతున్నాయి.
Discussion about this post