దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా, తూర్పు భారతీయులు చైనీయుల మాదిరిగా కనిపిస్తారని శాం పిట్రోడా చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి తెరలేపింది. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్‌గా ఉన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. వారసత్వ పన్ను గురించి మాట్లాడి ఇటీవల కాంగ్రెస్ పార్టీని ఆయన ఇరుకునపడేశారు. తాజాగా భారత్‌లో భిన్నత్వం గురించి చెప్పడానికి పోలికలు తీరును ప్రస్తావించారు. భారత ప్రజాస్వామ్యం, భిన్నత్వం గురించి పిట్రోడా మాట్లాడిన ఆయన మనది వైవిధ్యమైన దేశమని.. తూర్పున ఉన్న ప్రజలు చైనీయుల్లా, పశ్చిమ వాసులు అరబ్బుల మాదిరిగా కనిపిస్తారని తెలిపారు. ఇక ఉత్తరాది వాళ్లు శ్వేత జాతీయులుగా, దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్ల మాదిరిగా ఉంటారన్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా.. భాషలు, మతాలు, సంప్రదాయాలు, ఆహార అలవాట్లను పరస్పరం గౌరవించుకుంటాం. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం దేశ మూలాల్లో పాతుకుపోయాయని చెప్పుకొచ్చారు.
శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. వరంగల్ ఎన్నికల సభలో ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీ లక్ష్యంగా చేసుకున్నారన్నారు. తనకు చాలా కోపంగా ఉందని తెలిపారు. ఎవరైనా ఆయన్ని తిడితే ఆయనకు కోపం రాదని సహస్తారనన్నారు.. కానీ దేశం ప్రజలపై చేసిన వ్యాఖ్యలు ఆయనకు చాలా కోపం తెప్పించాయని మోదీ అన్నారు. రాజ్యాంగాన్ని నెత్తిన పెట్టుకుని డాన్స్ చేస్తున్నవారు చర్మం రంగు ఆధారంగా తన దేశ ప్రజలను అవమానిస్తున్నారు అని అన్నారు మోదీ.. గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన పిట్రోడా వ్యాఖ్యలు మన దేశం పట్ల సోనియా, రాహుల్‌ల ఆలోచనను ప్రతిబింబిస్తాయని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆరోపించారు. ఇది సిగ్గుచేటు అని, దీనికి కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని అన్నారు. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, అనురాగ్ ఠాకుర్ తదితరులు కూడా పిట్రోడా మాటల్ని ఖండించారు. కాంగ్రెస్ నాయకత్వం విదేశీయులది. అందుకే భారతీయులను విదేశీ మూలాలుగా చూస్తున్నారు. దేశాన్ని విభజించాలని కాంగ్రెస్ చూస్తోందని బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది ఆరోపించారు.
తాను ఈశాన్య భారతానికి చెందిన వ్యక్తిని. కానీ భారతీయుడిలా కన్పిస్తా. వైవిధ్య భారతావనిలో మనం విభిన్నంగా కన్పించినా మనమంతా ఒక్కటే. దేశం గురించి కనీస పరిజ్ఞానం పెంచుకోండి అని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ హితవు పలికారు. పిట్రోడా వ్యాఖ్యలు ప్రజల మనోభావాలను గాయపరిచాయని మణిపుర్ సీఎం బీరేన్‌సింగ్, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థి, సినీనటి కంగనా రనౌత్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీకి మెంటార్‌గా ఉన్న పిట్రోడా చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు. శాం పిట్రోడా చేసిన ఈ వ్యాఖ్యలు దురదృష్టకరమని, ఆమోదనీయం కాదని, ఈ వ్యాఖ్యలకు, కాంగ్రెస్ పార్టీకి సంబంధంలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ చెప్పారు. కాంగ్రెస్ మిత్రపక్షాలు కూడా పిట్రోడా వ్యాఖ్యలను ఖండించాయి. రాజకీయ వివాదం నేపథ్యంలో పిట్రోడా తన పదవికి రాజీనామా చేశారు. దానిని అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదించారు.
Discussion about this post