తానెప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాలు చేయనని ప్రధాని మోదీ అన్నారు. తనకు ఎంతోమంది ముస్లిం స్నేహితులు ఉన్నారని చెప్పారు. తన వ్యాఖ్యలు పేదవారి అవస్థల గురించి మాత్రమేనని, తన వ్యాఖ్యలను ముస్లిం సమాజం గురించి అంటూ వక్రీకరించి జరిపిన దుష్ప్రచారంపై ఆశ్చర్యపోయానన్నారు. చిన్నప్పుడు తమ ఇంట్లో ఈద్ పండగను కూడా నిర్వహించేవారమని ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
నేను ఓటు బ్యాంకు రాజకీయాలు చేయను. సబ్కా సాథ్-సబ్కా వికాస్‌ను బలంగా నమ్ముతాను. నా మాటలపై జరిగిన దుష్ప్రచారం చూసి షాక్ అయ్యాను. ఎక్కువమంది పిల్లలు గురించి మాట్లాడినప్పుడు అది ముస్లింల గురించి అని ఎవరు చెప్పారు..? పేద కుటుంబాల్లోనూ ఇదే పరిస్థితి. కొన్ని కుటుంబాల్లో వారి సామాజిక పరిస్థితితో సంబంధం లేకుండా అధిక సంతానం ఉంది. అది ఏ వర్గం అని నేను ప్రస్తావించలేదు. చూసుకోగలిగినంతమంది సంతానాన్నే కనాలి కానీ..వారిని ప్రభుత్వం చూసుకునే పరిస్థితి ఉండకూడదని మాత్రమే చెప్పాను అంటూ మోదీ స్పష్టత ఇచ్చారు.
2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్లో అల్లర్లు జరిగినప్పుడు మోదీ.. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. తన ప్రత్యర్థులు ముస్లిం వర్గంలో తన ప్రతిష్ఠను దెబ్బతీశారని దుయ్యబట్టారు. చిన్నప్పుడు మా ఇంటి చుట్టుపక్కల ఎన్నో ముస్లిం కుటుంబాలు ఉండేవి. మా ఇంట్లో కూడా మిగతా పండగలతో పాటు ఈద్ కూడా నిర్వహించేవాళ్లం. ఈద్ రోజున మా ఇంట్లో వంట చేసుకునేవాళ్లం కాదు. ఆ వర్గానికి చెందిన కుటుంబాలే మాకు ఆహారం తెచ్చిఇచ్చేవి. అలాగే మొహర్రంలోనూ భాగమయ్యేవాళ్లం. అలాంటి ప్రపంచంలో నేను పెరిగాను. నా స్నేహితుల్లో చాలా మంది ముస్లింలు ఉన్నారు అని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ఆ వర్గం నాచే నాకు ఓట్లు పడతాయని…ఈ దేశ ప్రజలు తనకు ఓటు వేస్తారని అన్నారు. హిందూ-ముస్లిం అంటూ తేడా చూపడం ప్రారంభించిన రోజు.. ప్రజాజీవితంలో ఉండే అర్హత తనకు ఉండదన్నారు. అలాంటి తేడా ఎన్నటికీ చూపనంటూ ప్రతిజ్ఞ చేశారు.
కొద్దిరోజుల క్రితం రాజస్థాన్‌లో ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ… మోదీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ప్రజల వద్ద ఉన్న బంగారంతో సహా సంపద మొత్తం సర్వే చేసి అందరికీ సమానంగా పునఃపంపిణీ చేస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చెప్పింది. ఆ మేరకు దేశ సంపదనంతా చొరబాటుదారులకు, ఎక్కువమంది పిల్లలు ఉన్నవారికి పంచుతారు. మీ ఆస్తులను జప్తు చేసే అధికారం ప్రభుత్వాలకు ఉందా? అర్బన్ నక్సలిజం మనస్తత్వం ఉన్న ఆ పార్టీ నాయకులు మహిళల మంగళ సూత్రాలను కూడా వదలరు. మీ కష్టార్జితం చొరబాటుదారుల పాలవడం మీకు సమ్మతమేనా?’’ అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.
Discussion about this post