టీ, కాఫీలు ఎప్పుడు పడితే అప్పుడు తాగేస్తున్నారా… భోజనానికి ముందు, ఆ తర్వాత వీటిని సేవిస్తున్నారా… అస్సలు వొద్దు.. అలా చేశారా చాలా ఇబ్బందుల్లో పడినట్లే… ఇది మేము చెబుతున్న మాట కాదు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) చెబుతున్న మాట…
టీ, కాఫీలపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు అనేక విషయాలను చెప్పారు. టీ, కాఫీల వినియోగంలో చాలా జాగ్రత్తలవసరమని చెబుతున్నారు. వాటిని మితంగా వినియోగించాలంటున్నారు. టీ, కాఫీలనేవి ఇండియాలోని చాలా మందికి చాలా ఇష్టమైనవి.. వాటిని తాగకుండా ఉండటం అంటే చాలా మందికి చాలా కష్టమైన పని.. కానీ వాటికి దూరంగా ఉండటమే మంచిదని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
భారతదేశం అంతటా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించే లక్ష్యంతో.. మెడికల్ బాడీ ఇటీవల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) భాగస్వామ్యంతో 17 కొత్త ఆహార మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు వైవిధ్యమైన ఆహారం, చురుకైన జీవనశైలి ప్రాముఖ్యతను చెప్పాయి.
జనాల సాంస్కృతిక ప్రాముఖ్యతను గుర్తిస్తూ, వైద్య నిపుణులు ఆరోగ్య సమస్యల కారణంగా టీ, కాఫీలను ఎక్కువగా తీసుకోవద్దని హెచ్చరించారు.
టీ, కాఫీల్లో “కెఫీన్ ఉంటుంది, ఇది కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంటాయన్నారు. ICMR మార్గదర్శకాలు టీ, కాఫీలలో కెఫిన్ కంటెంట్‌పై కూడా కొన్ని విషయాలు చెప్పాయి. 150ml కప్ బ్రూడ్ కాఫీలో 80 – 120 mg కెఫీన్, ఇన్స్టంట్ కాఫీలో 50 – 65mg.. టీలో 30 – 65mg ఉంటుందని తెలిపాయి.
ICMR కేవలం 300mg కెఫిన్‌ను రోజువారీగా తీసుకోవాలని సూచించింది.
భోజనానికి ముందు.. ఆ తర్వాత కనీసం ఒక గంట టీ లేదా కాఫీని నివారించాలని వైద్య సంస్థ సూచించింది. ఎందుకంటే వాటిలో టానిన్లు ఉంటాయి. దాని వల్ల శరీరంలో ఇనుము శోషణను తగ్గిపోతుంది. టానిన్లు కడుపులో ఇనుముతో ముడిపడి ఉంటాయి. శరీరం ఇనుమును సరిగ్గా గ్రహించడం కష్టతరం చేస్తుంది. ఇది ఇనుము లోపం, రక్తహీనత వంటి ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. కాఫీ ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, గుండె సంబంధిత లోపాలు కూడా తలెత్తుతాయని పేర్కొంది.
నూనె, చక్కెర మరియు ఉప్పు తీసుకోవడం పరిమితం చేస్తూ పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ మాంసాలు.. సముద్రపు ఆహారంతో కూడిన ఆహారాన్ని కూడా తీసుకోవచ్చని తెలుపుతున్నాయి. సో ఏది ఏమైనా టీ, కాఫీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది…
Discussion about this post