ఎన్డీఏ కూటమికి అధికారం దక్కడంలో కీలకమైన యూపీ, మహారాష్ట్ర, బిహార్‌లో ఈసారి ఓటర్ల తీర్పు ఎలా ఉండనుంది? మహారాష్ట్ర, బిహార్‌లోని విపక్ష కూటముల నేతలను ఆకర్షించి .. ప్రభుత్వాలను మార్చేసిన అప్రదిష్ఠ చేటు చేస్తుందా? ప్రత్యర్థులపై సానుభూతి పెరిగి కమలానికి ఎదురుదెబ్బ తగలనుందా? ఎన్నికల నేపథ్యంలో ఇవన్నీ ఆసక్తికరమైన ప్రశ్నలు..ఆ మూడు రాష్ట్రాల్లో ఏం జరిగింది ? ఏం జరుగుతోంది ? ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం .
హిందూత్వవాదం బలంగా ఉండే యూపీ, మహారాష్ట్ర, బిహార్‌లో మొత్తం 168 సీట్లున్నాయి.2014 ఎన్నికల్లో ఎన్డీఏకి యూపీలో 73, మహారాష్ట్రలో 41, బిహార్‌లో 33 మొత్తం 147 సీట్లు దక్కాయి. ఇక 2019లో సైతం యూపీలో 64, మహారాష్ట్రలో 41, బిహార్‌లో 39 మొత్తం 144 సీట్లు వచ్చాయి. అయితే, ప్రస్తుతం ఎన్డీఏకు వాతావరణం ఏకపక్షంగా లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బిహార్‌లో ఆర్జేడీతో కలిసి ప్రభుత్వం నడుపుతున్న నీతీశ్ కుమార్‌ను తమవైపు తిప్పుకోవడం, మహారాష్ట్రలో ఉద్ధవ్ సారథ్యంలోని కాంగ్రె్స-శివసేన- ఎన్సీపీ సర్కారును ఏక్నాథ్ షిండే ద్వారా కూల్చేయడం, ఆపై అజిత్ పవార్‌నూ ఆకర్షించి ఎన్సీపీని చీల్చడం బీజేపీ పట్ల వ్యతిరేకతను పెంచిందనే విశ్లేషణలు వస్తున్నాయి.
ముఖ్యంగా గత రెండు ఎన్నికల్లో ఎన్డీఏ 48 సీట్లకు గాను 41 చొప్పున సాధించిన మహారాష్ట్రలో ఈసారి సీట్లకు భారీగా గండి పడే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఎన్సీపీ, శివసేనలను చీల్చడంలో బీజేపీ పాత్ర ఉందన్న ప్రచారంతో శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రే పట్ల ప్రజల్లో సానూభూతి ఏర్పడిందని, ఆది ఓట్ల రూపంలో మారుతుందని చెబుతున్నారు.ఎమ్మెల్యేలు, ఎంపీలు చీలిక వర్గాల్లోకి వెళ్లిపోయినా కార్యకర్తలు మాత్రం శరద్ పవార్, ఉద్ధవ్ వైపే ఉన్నారని, శరద్‌పవార్ ఎన్సీపీ..ఉద్ధవ్ శివసేన కాంగ్రెస్ తో కూడిన మహా వికాస్ అఘాడీతో గట్టిపోటీ ఖాయమని అంటున్నారు.
బిహార్‌లో ప్రాంతీయంగా ప్రధాని మోదీని సవాలు చేయగల స్థాయికి ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ మరింత బలమైన నేతగా ఎదిగారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మైనారిటీ, యాదవులు, దళితుల దన్నుతో ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి నుంచి గట్టి పోటీ ఖాయమని అంటున్నారు. నీతీశ్ తరచూ కూటములను మార్చడం బిహార్ ప్రజలకు ఏవగింపు కలిగించిందని, అలాంటి నాయకుడితో జట్టు కట్టడం బీజేపీకీ ఇబ్బందిగా మారనుందని పరిశీలకుల అంచనా.
Discussion about this post