వైశాఖ మాసం శుక్ల పక్షంలోని తృతీయ తిథి నాడు జరుపుకునే పవిత్రమైన హిందూ పండుగ అక్షయ తృతీయ. దేశంలోని వివిధ ప్రాంతాల్లో గొప్ప వైభవంగా జరుపుకుంటారు. ‘అక్షయ్’ అనే పదానికి శాశ్వతమైనది… అంటే ఎప్పటికీ అంతం లేనిది. అందువల్ల, అక్షయ తృతీయ ప్రతి ఒక్కరికీ శాశ్వతమైన శ్రేయస్సు, ఆశీర్వాదాలు, ఆనందం, విజయం, ఆనందాన్ని ఇస్తుంది!. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే వ్రతం, జపం,హోమం, దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణమేదైనా దాని ఫలితం అక్షయమౌతుందని చెపుతారు. అక్షయ తృతీయ నాడు చేసే దానాలు మంచి ఫలితాలిస్తాయి. ముఖ్యంగా సంపదలకు అధిపతి అయిన లక్ష్మీదేవి పూజ చేయడం ద్వారా లక్ష్మీ అనుగ్రహం లభించడంతో పాటు సత్ఫలితాలు చేకూరతాయి. ఈ రోజు పుత్తడి కొంటే అక్షయం అవదు కానీ ఈ రోజు చేసే పుణ్య కార్యాలు మాత్రం రెట్టింపు ఫలితాన్నిస్తాయి…చిన్న పాపం చేసినా అది అక్షయం అవుతుంది.
వైశాఖ మాసం అంటే ఎండలు మండిపోయే సమయం. అందుకే ఈ అక్షయ తృతీయ రోజు కొత్త కుండలో నీళ్లు పోసి దానం చేస్తారు. అన్నదానం చేస్తే మరింత ఫలితం. ఇంకా గొడుగు, చెప్పులు, దుస్తులు దానం చేయాలి. ఎక్కడిక్కకడ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, పానకం, మజ్జిగ, పండ్లు దానం ఇవ్వడం మంచిది. ఇలా అక్షయ తృతీయ రోజు పుణ్యాన్ని అక్షయం చేసుకోమని అర్థకానీ…పోటీపడి బంగారం కొనుక్కుని తెచ్చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుందని కాదు. వైశాఖమాసం ప్రారంభమైన మూడో రోజు అక్షయతృతీయ జరుపుకుంటారు. ఈ రోజున బంగారం షాపులన్నీ కళకళలాడిపోతుంటాయ్.. ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తారు. షాపుల దగ్గర బారులు చూస్తే అక్కడేమైనా ఉచితంగా బంగారం పంచుతున్నారా అనే సందేహం వస్తుంది. అప్పు చేసైనా .. ఎంతో కొంత బంగారం కొనేయాలని పోటీపడతారు. కానీ నిజంగా అక్షయ తృతీయ రోజు కొనాలా? కొనకపోతే ఏమువుతుంది? అసలు అక్షయ తృతీయ ఉద్దేశం ఏంటో తెలుసా?
అక్షయ అంటే నాశనం లేనిది, తరగనిది అని అర్థం. అక్షయపాత్ర అనే మాట వినే ఉంటారుగా… పాత్రలోంచి ఎంత తీసినా తరిగిపోకుండా మళ్లీ మళ్లీ నిండుతూనే ఉంటుంది. అలా అక్షయం అనే మాట వినగానే ఓ రకమైన పూనకంతో బంగారం కొనేస్తుంటారు. అంటే ఈ రోజున బంగారం కొనుగోలు చేస్తే ఇంట్లో సంపద, బంగారం అక్షయం అయిపోతుందని భావిస్తారు. కానీ ఈ ఆలోచనే సరికాదంటున్నారు పండితులు. అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే కష్టాలు కొనితెచ్చుకున్నట్టే!..
అక్షయ తృతీయ పేరు వినగానే బంగారం.. బంగారం అని ఊగిపోయే వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. కలిపురుషుడు ఐదు స్థానాల్లో నివాసం ఉంటాడు. అందులో ఒకటి బంగారం. పసిడిని అహంకారానికి హేతువుగా చెబుతారు…అంటే అక్షయ తృతీయ రోజు కలిపురుషుడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడమే కాకుండా అహంకారాన్ని మరింత పెంచుకున్నట్టు అర్థం. మరి అక్షయ తృతీయ అంటే బంగారమే అనే ప్రచారం ఎందుకొచ్చిందనే సందేహం రావొచ్చు…ఈ రోజు బంగారం కొనుగోలు చేయాలని కాదు దానం చేయాలన్నది అసలు ఆంతర్యం. కానీ బంగారం దానం చేసేంత స్తోమత అందరకీ ఉండదు కదా.. ఆహారం, వస్త్రాలు దానం చేయడం వల్ల పుణ్యం అక్షయం అవుతుందని చెబుతారు..అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేయాలన్న ప్రచారం కేవలం వ్యాపారం పెంచుకునే ట్రిక్ మాత్రమే. ఆ మాయలో పడి బంగారం కొనుగోలు చేసేందుకు పోటీ పడకండి..
అక్షయ తృతీయ రోజు మొత్తం మంచి ముహూర్తంగానే భావిస్తారు. ఈ రోజు దుర్ముహుర్తాలు, వర్జ్యాలు, యమగండం లాంటివి పెద్దగా ప్రభావం చూపవు. రోజు మొత్తం ఏం చేసినా శుభఫలితాలే వస్తాయని విశ్వసిస్తారు. అక్షయ తృతీయ రోజున ఏం కొన్నా అక్షయం అవుతుందనే నమ్మకంతో స్థిరాస్తులపై పెట్టుబడులు పెడుతుంటారు. .ఈరోజున ఏ సమయంలో పెట్టుబడులు పెట్టినా భవిష్యత్తులో మంచి లాభాలొస్తాయి. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవారు ఈరోజు షేర్లు కొంటే, భవిష్యత్తులో భారీగా పెరుగుతాయని చాలా మంది నమ్ముతారు. కొందరు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్తులో మంచి లాభాలొస్తాయని నమ్ముతారు. ఈ పండుగ చాలా పవిత్రమైనదిగా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ పండుగను ఉత్తమంగా జరుపుకోండి..
Discussion about this post