అనంతపురం జిల్లాకే తలమానికమైన టవర్ క్లాక్ బ్రిడ్జి నిర్మాణం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. దీంతో నగరంలోని సగం ట్రాఫిక్ తగ్గిపోయింది. గతంలో రైల్వే ట్రాక్ పై నుండి వెళ్ళే ఈ బ్రిడ్జి శిధిలావస్థకు చేరుకోవడంతో ప్రభుత్వం దీనిని పునర్నిర్మించింది.
అనంతపురం రోడ్లు ఇరుకుగా ఉండడంతో నగరంలోని సంగమేష్ నగర్ నుండి బళ్లారి బైపాస్ వరకు జాతీయ రహదారి నిర్మాణం చేపట్టేందుకు ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.
ఈ రోడ్డును జాతీయ రహదారిగా మార్చేందుకు భారత రోడ్డు రవాణా , రహదారుల మంత్రిత్వ శాఖకు నివేదిక అందించారు. ఆ శాఖ సెక్రటరీగా గిరిధర్ ఉండడంతో ఈ రోడ్డును మున్సిపాలిటీ పరిధి నుండి జాతీయ రహదారిగా మార్పు చేశారు. జాతీయ రహదారి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 311 కోట్ల నిధులు కేటాయించింది. కేవలం పదహారు నెలల వ్యవధిలోనే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారు.ఇదిలా ఉండగా జిల్లాకే తలమానికమైన టవర్ క్లాక్ పక్కనే ఉన్న సర్వీస్ రోడ్డు మాత్రం గుంతల మయంగా ఉండడంతో నగర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నగరంలోని టవర్ క్లాక్ కూడలి నుండి మొదలయ్యే బ్రిడ్జి నగరంలోని నడిమి వంక సమీపంలోని పీటీసీ వద్ద పూర్తి అవుతుంది. ఇదే బ్రిడ్జి కింద అండర్ బ్రిడ్జిని కూడా నిర్మించారు. ఈ రోడ్డు నుంచి నగరంలోని పీటీసి 1 నుండి 6 వ రోడ్డులకు సర్వీస్ రోడ్డు ఏర్పడింది. దీంతో స్థానిక టవర్ క్లాక్ నుండి మొదలయ్యే వాహనాలన్నీ క్రమ పద్ధతిలో ఏ వైపు వాహనాలు ఆ వైపునకు వెళ్ళే సదుపాయం కల్పించారు.అయితే ఫ్లై ఓవర్ బ్రిడ్జి పక్కన సర్వీస్ రోడ్డు పూర్తి అవ్వకపోవడంతో వాహన దారులకు ఇక్కట్లు తప్పలేదు. నగరంలోని ప్రధాన రోడ్లన్నీ నిర్మించినప్పటికి కేవలం 120 అడుగుల సర్వీస్ రోడ్డు నిర్మించక పోవడంతో ట్రాఫిక్ తో పాటు వాహన దారులు రాంగ్ రూట్లో వెళ్తుండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాహన దారులు, నగర ప్రజలు చెబుతున్నారు.
అయితే ఇదే అంశం పై ఆర్ అండ్ బి , జాతీయ రహదారుల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నగరంలో జాతీయ రహదారి రావడం నగర ప్రజల వరంగా భావించవచ్చని ఇది నగర ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, భారత రోడ్డు రవాణా – రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి గిరిధర్ చొరవతోనే నగరంలో జాతీయ రహదారి శాంక్షన్ అయ్యిందన్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం రూ.311 కోట్ల రూపాయలు నిధులను కేటాయించడంతో త్వరితగతిన పూర్తి చేయగలిగామన్నారు.
ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయని, ల్యాండ్ అక్విజేషన్ నిధులను బాధితులకు అందించేందుకు వారు ఇచ్చిన ఎకౌంట్లు సరిగా లేనందున120 అడుగుల సర్వీస్ రోడ్డు పెండింగ్ లో ఉందన్నారు. ఒకటి రెండు నెలల్లో వాటిని పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. నగరంలో సువిశాలమైన రోడ్డు నిర్మాణం జరగడం నగరంలోని ట్రాఫిక్ నియంత్రణకు తోడ్పాటు అవుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు సుధాకర్ రెడ్డి తెలిపారు. నగరాల్లో జాతీయ రహదారుల నిర్మాణం, వైడింగ్ ప్రక్రియ చేపట్టి వంపులు లేకుండా చేయడం అసాధ్యమని వంపులు ఉన్నప్పటికీ ప్రమాదాలుసంభవించమని భరోసా ఇచ్చారు.
Discussion about this post