ఉత్తరప్రదేశ్ లోని బహ్రౌక్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల E- రిక్షా డ్రైవర్ ఆర్తి, బ్రిటన్ రాజు ఛార్లెస్ 3 నుంచి అమల్ క్లూనీ మహిళా సాధికారత అవార్డు అందుకుంది. తన జీవితంలో ఈ క్షణాలు అపురూపమైనవని ఆమె ఆనందంతో తబ్బిబ్బవుతూ చెప్పారు. కింగ్ ఛార్లెస్ స్థాపించిన ప్రసిద్ద మానవహక్కుల సంస్ధ ఈ అవార్డును ప్రకటించింది. యువతలో స్ఫూర్తిని నింపినందుకు గాను ఆమెను ఈ అవార్డు వరించింది. ఛార్లెస్ ట్రస్ట్ అంతర్జాతీయంగా 20 దేశాల్లో యువతులకు ఉద్యోగ కల్పన, విద్య, వ్యాపారాల్లో సహాయ సహకారాల కార్యక్రమాలను అందిస్తోంది. సవాళ్లను అధిగమించి లక్ష్యాలను చేరుకున్న యువతికి ఈ ట్రస్టు నుంచి అవార్డులు అందిస్తోంది.
ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న యువతులకు మార్గదర్శకంగా నిలవడం చాలా ఆనందంగా ఉందని ఆర్తి అన్నారు. అవార్డు అందుకోవడంతో ప్రపంచం మరింత అందంగా కనిపిస్తుందన్నారు. ప్రస్తుతం తన కలలను సాకారం చేసుకోవడమే కాకుండా ఐదేళ్ల కూతురి కోర్కెలను కూడా తీరుస్తున్నానన్నారు. కూతురుకు లండన్ నుంచి కేక్, ఒక జత బూట్లు ఆమె తీసుకువెళుతోంది. బ్రిటన్ రాజును కలుసుకుంటానని ఎప్పుడూ అనుకోలేదన్నారు. ఛార్లెస్ తో ఆమె హిందీలోనే మాట్లాడుతూ తన రిక్షా డ్రైవింగ్ ను ఎంతగా ఇష్టపడతానో చెప్పింది. పెట్రోల్ ,డీజిల్ తో వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందని ఎలక్ర్టానిక్ ఆటోతో ఆ ఇబ్బంది ఉండదన్నారు. సాయంత్రం ఇంటికి వెళ్లగానే E- రిక్షాకు చార్జింగ్ పెడతానన్నారు. పురుష గుత్తాధిపత్యంలోని ఆటో రవాణా రంగంలో మహిళ అయినప్పటికి సత్తా చూపిందని అమల్ క్లూనీ సంస్థ ఆనందం వ్యక్తం చేసింది. ఆర్తి గులాబీ రంగు E- రిక్షాలో బకింగ్ హాం ప్యాలెస్ లో జరిగిన రిసెప్షన్ కు హాజరయ్యారు.
దేశంలో మహిళా సాధికారత కోసం అగాఖాన్ ఫౌండేషన్ AKF, కింగ్ ఛార్లెస్ ఇంటర్నేషనల్ ట్రస్ట్ ద్వారా అందించే E- రిక్షా స్కీముకు కీర్తి ఎంపికయ్యింది. మహిళా డ్రైవర్లకు సబ్సిడీ కూడా అందించారు. గ్రామాల్లో ఉండే పేద యువతులకు అవకాశాలు కల్పించి, వారి కాళ్లపై వారు నిలబడేట్టు చేయడమే ఈ స్కీము ముఖ్య ఉద్దేశ్యం. ఈ రంగంలో ఉండే ఆటుపోట్లను ఆర్తి ధైర్యంగా ఎదుర్కొని విజయపథాన నడిచిందని AKF CEO టిన్ని సాహ్నె తెలిపారు. ఆర్తి వెంట ఆమె కూడా ఉన్నారు. కీర్తి హిందీ మాటలను కింగ్ ఛార్లెస్ కు ఆమె తర్జుమా చేశారు. కింగ్ ఛార్లెస్ ట్రస్ట్ సీఈవో విల్ స్ట్రా మాట్లాడుతూ సామాజిక అడ్డంకులను తొలగించుకొని కీర్తి సక్సెస్ సాధించినందుకు చాలా గర్వపడుతున్నానన్నారు. మా సంస్థ చేపట్టిన పనులు యువతులకు నైపుణ్యాలు మెరుగుపరచుకునే అవకాశాలతోపాటు, జీవన భృతి కూడా కల్పించడం సంతోషాన్నిస్తుందన్నారు.
Discussion about this post