దుబాయ్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం నిర్మాణం కానుంది. ఈ మేరకు దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేశారు. ఈ ఎయిర్‌పోర్టును అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయంగా పిలవనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా 34.85 బిలియన్ డాలర్లు వెచ్చిస్తున్నట్లు వెల్లడించారు. అంటే మన భారతీయ కరెన్సీలో రూ. 2.9లక్షల కోట్లు అన్నమాట..
ఏడాదికి 260 మిలియన్ల మంది రాకపోకలు కొనసాగించేలా ఈ విమానాశ్రయాన్ని నిర్మించనున్నట్లు చెప్పారు. ఇక అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రస్తుత దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కంటే ఐదు రెట్లు పెద్దదిగా ఉంటుందని, రాబోయే సంవత్సరాల్లో దుబాయ్ ఎయిర్‌పోర్టు నుండి అన్ని కార్యకలాపాలు అల్ మక్తూమ్‌కు బదిలీ చేస్తామని అన్నారు. 400 టెర్మినల్ గేట్లు, ఐదు సమాంతర రన్వేలు ఈ విమానాశ్రయంలో ఉండనున్నాయి. ఫ్లాగ్షిప్ క్యారియర్ ఎమిరేట్స్, లోబడ్జెట్ విమానయాన సంస్థ ఫ్లైదుబాయ్‌తో పాటు ప్రపంచాన్ని దుబాయ్‌కి, బయటికి కనెక్ట్ చేసే అన్ని ఎయిర్‌లైన్ భాగస్వాములకు కొత్త డెస్టినేషన్ కానుందని దుబాయ్ ప్రభుత్వ ఎయిర్‌లైన్ ఎమిరేట్స్ చైర్మన్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్-మక్తూమ్ వెల్లడించారు. ఈ నిర్మాణం ప్రపంచ వేదికపై ప్రముఖ ఏవియేషన్ హబ్‌గా దుబాయ్ స్థానాన్ని మరింత పటిష్ఠం చేస్తుందని దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ సీఈఓ పాల్ గ్రిఫిత్స్ దుబాయ్ మీడియాతో చెప్పారు.
మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో కొత్తగా నిర్మించనున్న టెర్మినల్‌ను అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుగా పిలుస్తారు. దుబాయ్‌లో త్వరలో ప్రపంచ ఎయిర్‌పోర్టు, పోర్టు, అర్బన్ హబ్, న్యూ గ్లోబల్ సెంటర్ అందుబాటులోకి రానున్నాయని దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ పేర్కొన్నారు. తదుపరి కార్యకలాపాలు అక్కడనుంచే సాగుతాయని, భవిష్యత్తు తరాల కోసం ఈ కొత్త ప్రాజెక్టును చేపడుతున్నామని పేర్కొన్నారు. ఇందులో సరికొత్త టెక్నాలజీలను వినియోగించనున్నారు.
దక్షిణ దుబాయ్‌లో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోన్న ఈ ఎయిర్‌పోర్టు చుట్టూ నగర నిర్మాణం కాబోతోంది. లక్షల మంది నివాసం ఉండే అవకాశం ఉండడంతో, హౌసింగ్‌కు భారీ డిమాండ్ ఏర్పడనుంది. లాజిస్టిక్, ఎయిర్‌పోర్టు రంగంలో అతిపెద్ద కంపెనీలకు ఇది కేంద్రంగా మారనుంది.
Discussion about this post