సాగర నగరం విశాఖపట్నానికి మరో విశిష్ట అతిథి వచ్చింది. ‘ది వరల్డ్’ అనే అంతర్జాతీయ క్రూయిజ్ నౌక వైజాగ్ పోర్ట్ ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్‌కు చేరుకుంది. విశాఖ ఇంటర్నేషనల్ టెర్మినల్‌కు వచ్చి తొలి అంతర్జాతీయ నౌక ఇదే. దీంతో నౌకాశ్రయ అధికారులు ఆ షిప్‌కు సంప్రదాయ పద్ధతిలో ఘనస్వాగతం పలికారు. ప్రపంచంలోనే అతి ఖరీదైన ఈ నివాస క్రూయిజ్ నౌకలో 165 సూపర్ లక్సరీ అపార్ట్ మెంట్లు, ప్లే గ్రౌండ్ తో సహా అన్ని సౌలభ్యాలున్నాయి. 12 అంతస్తులు కలిగిన 644 అడుగుల షిప్ ను 2002 లో ప్రారంభించారు.
ప్రపంచం మొత్తాన్ని చుట్టేయాలని అనుకునే పర్యాటకులు ఎంతోమంది.. ఈ క్రూయిజ్‌లో ప్రయాణిస్తారు. అమెరికాలో తన ప్రయాణం ప్రారంభించిన క్రూయిజ్.. అంటార్కిటికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆసియా ఖండాలను చుట్టేయనుంది. ఈ నౌకలో మొత్తం 80 మంది ప్రయాణీకులు విశాఖకు చేరుకున్నారు. వీరంతా ఆది, సోమవారాల్లో విశాఖ నగర అందాలను వీక్షించనున్నారు. తిరిగి ఈ నౌక సోమవారం రాత్రి వైజాగ్ హార్బర్ నుంచి పోర్టుబ్లెయిర్ బయలుదేరి వెళ్తుంది. ఈ భారీ షిప్‌ను చూసేందుకు వైజాగ్ ప్రజలు భారీగా తరలివచ్చారు. చూడటానికి ఓ భారీ భవంతిలా కనిపించే ఈ నౌక రాకతో విశాఖ నగరం సంతోషంతో పొంగిపోయింది.
‘ద వరల్డ్’ క్రూయిజ్‌లో 19 స్టుడియో అపార్ట్మెంట్లు, 40 స్టుడియోలు ఉన్నాయి. వీటిల్లో సుమారు 200 మంది వరకు ఉండొచ్చు. పెద్ద లాబీ, సూపర్ మార్కెట్లు, బొటిక్, ఫిట్నెస్ సెంటర్లు, టెన్నిస్ కోర్టు, జాగింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, కాక్టెయిల్ లాంజ్.. ఇలా అన్ని సౌకర్యాలు ఈ షిప్లో ఏర్పాటు చేశారు. నౌక వివిధ నగరాలకు చేరుకున్న సమయంలో వీరంతా స్థానిక పర్యాటక ప్రాంతాలు సందర్శించి తిరిగి నౌకలోకి వెళ్లిపోతారు. అలా వీరి ప్రయాణం మొత్తం సముద్రం మీదే సాగిపోతూ ఉంటుంది.
అయితే మల్టీ బిలియనీర్లు, బిలియనీర్లకు మాత్రమే ఈ క్రూయిజ్ అందుబాటులో ఉంటుంది. ఈ నౌకలోని అపార్ట్ మెంటులో మీరు ఉండాలనుకుంటే అందులో నివసించే ఇద్దరి రికమండేషన్ తప్పనిసరి. అంతే కాదు 10 మిలియన్ డాలర్లు డిపాజిట్ చేయాల్సి ఉంది. భూగోళంపై ఉన్న అత్యంత ధనవంతులు అక్కడ సరదాగా, కొంటెగా ప్రపంచ నివాస క్రూయిజ్ లో గడుపుతారు. అయితే మామూలు క్రూయిజ్ ల్లో కాకుండా దీని అపార్ట్ మెంటుల్లో నచ్చిన విధంగా అలంకరణలు, పునర్నిర్మాణాలు చేసుకోవచ్చు. అలాగే అందమైన అత్యాధునిక ఫర్నీచర్ ను కూడా వాడవచ్చు. భూగోళంపై ఉన్న అత్యంత ధనవంతులు అక్కడ సరదా.. సరదాగా గడుపుతూ ప్రపంచాన్ని చుట్టి వస్తారు.
Discussion about this post