నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం పరిధిలో యాదవుల ఇష్టదైవం చిన్నగుట్ట లింగముల స్వామి మొక్కులకు వేళయింది. నెల్లిబండ చిన్నగుట్ట లింగమంతులస్వామి చౌడమ్మ జాతర ప్రారంభమైంది . భక్తుల కొరికలు తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందిన చిన్నగుట్ట లింగమంతుల స్వామి జాతర రెండేళ్లకోసారి నిర్వహిస్తారు. గతేడాది ఫిబ్రవరిలో పెద్దగట్టు జాతర ముగియగా… ఈ ఏడాది మే 19న ప్రారంభం అయిన చిన్నగట్టు జాతర… ఈ నెల 21న ముగియనుంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ ఉత్సవానికి నల్లగొండ జిల్లా చూట్టు నలుములలా నుండి లక్షకు పైగా భక్తులు తరలివస్తారు.
సాధారణంగా శివాలయాలు ఉన్నచోట అభిషేకాలు, తీపి పదార్థాలతో నైవేద్యాలు పెట్టడం ఆనవాయితీ. కానీ… ఆ శివాలయం ఎదుట భారీ ఎత్తున పొట్టేలను ఆహారంగా సమర్పిస్తారు. త్రినేత్రడి కుమార్తెగా,సోదరిగా భావించే చౌడమ్మ తల్లికి మాంసాన్ని నైవేద్యంగా అందిస్తారు. ఇలాంటి విభిన్న సంస్కృతికి వేదికగా నిలుస్తుంది చిన్నగుట్ట లింగమంతుల స్వామి చౌడమ్మ జాతర. నెల్లిబండ జాతరను చిన్నగుట్ట జాతరగా, గొల్లగట్టు జాతరగా పిలుస్తారు.ఈ జాతరలో కేతేపల్లికి చెందిన వీరబోయిన, కాసాని వంశస్తులు హక్కు దారులుగా ఉంటారు.
పూర్వం శివుడు రాక్షసుల్ని వధిస్తూ… చిన్న గట్టుకు చెరుకున్నాడట. ఎంత మందిని చంపినా రాక్షసులు పుడుతూనే ఉండటంతో అలసిపోయిన శివుడు… చెమట చుక్కను చిన్న గట్టు వద్ద వదిలాడని ఆ చెమట చుక్క ద్వారా చౌడమ్మ దేవి జన్మించారని చెబుతారు. ఆ సంహార సమయంలో రాక్షసుల నెత్తురు తాగి శివునికి సహకరించింది చౌడమ్మ దేవి. ప్రతిగా భోళ శంకరుడు.. తన దగ్గరకు వచ్చే వారు యాదవిదిగా పూజలు చేసి… తన పక్కనే కొలువయ్యే చౌడమ్మకు మాత్రం రక్త,మాంసాలతో ఆకలి తీర్చుతారని మాటిచ్చాడట. ఈ యాఠలు ఇచ్చే సంస్కృతి చిన్న గట్టులో అలా వచ్చిందే చెబుతుంటారు.
ఈ నెల 19న కేతేపల్లి నుండి బయలు దేరే దేవర పెట్టే అర్ధరాత్రి చిన్న గట్టుకు చేరుకుంది. వీరబోయిన, కాసాని రెండు వంశాలకు చెందిన రెండు బోనాలను సోమవారం వేకువజామున స్వామి… అమ్మవార్లకు సమర్పించారు. సూర్యాపేట పెద్ద గట్టు జాతర తర్వాత… రెండో స్థానంలో నిలుస్తుంది చిన్నగుట్ట జాతర. నకిరేకల్ నియోజకవర్గంతో పాలు పలు మండలాల ప్రజలు ఈ జాతరకు తరలివస్తారు.
ఇంతటి పేరుగాంచిన చిన్న గట్టు జాతరను తెలంగాణ దేవాదాయ శాఖ చిన్న చూపు చూస్తుంది. గుట్టపై విద్యుత్ సరఫరా, మంచినీటి సౌకర్యం, రోడ్లు నిర్మాణం లేక భక్తులు ఇబ్బందులకు పడుతున్నారు. నేతలు మారుతున్నా…గుట్టను అభివృద్ధి చేయడం లేదని చెబుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుట్ట అభివృద్ధికి సహకరించాలని ఆలయ చైర్మన్ యానాల యాదగిరి రెడ్డి కొరుతున్నారు.
Discussion about this post