మహేంద్రసింగ్ ధోని పరిచయం అక్కర్లేని పేరు. ఈ మిస్టర్ కూల్ కెప్టెన్ తన కెరీర్లో సాధించిన ఘనతల ద్వారా భారత్‌లోనే కాకుండా విశ్వవ్యాప్తంగా అభిమానులను సంపాధించుకున్నాడు. ధోని ఎక్కడికి వెళ్లినా అభిమానులు నీరాజనాలు పలుకుతారు. ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి దాదాపు ఐదేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ క్రేజ్ తగ్గడంలేదు.
ఆటగాడిగానే కాకుండా వ్యక్తిగతంగానూ ధోనిని అభిమానించే వారు చాలామంది ఉన్నారు. ధోనిని స్టయిల్ ఐకాన్‌గా ఆరాధించే వారు కోకొల్లలు. ధోని తాజా లుక్కు సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. కెరీర్ ఆరంభంలో ధోని ఆహార్యం ఎలా ఉండిందో ప్రస్తుతం అలాగే ఉంది. జులపాల జట్టుతో ధోని సినిమా హీరోలను తలదన్నేలా ఉన్నాడు. 42 ఏళ్ల వయసులోనూ 24 ఏళ్ల యువకుడిలా కనిపిస్తున్నాడు. ధోనికి వయసు మీద పడుతున్నా వన్నె తగ్గడం లేదని అభిమానులు అనుకుంటారు.
అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత ఐపీఎల్‌కు, సినిమాలకు మాత్రమే పరిమితమైన ధోని.. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ ఆడేందుకు ముంబైకి వచ్చాడు. ఈ సందర్భంగా బీసీసీఐ హెడ్ క్వార్టర్స్‌కు సందర్శించిన ధోని.. భారత క్రికెట్ తరఫున తాను సాధించిన అద్భుతాలను నెమరువేసుకున్నాడు. బీసీసీఐ ఆఫీస్‌లో తాను సాధించిన ఘనతలను తలచుకుంటూ మురిసిపోయాడు. తన సారధ్యంలో టీమిండియా సాధించిన టీ20 వరల్డ్‌కప్, వన్డే వరల్డ్‌కప్ ట్రోఫీలను స్పర్శించి పరవశించిపోయాడు. టీమిండియా జెర్సీని చూసుకుని మురిసిపోయాడు. వన్డే వరల్డ్‌కప్‌లో తానాడిన విన్నింగ్ షాట్ ఫోటోగ్రాఫ్‌పై ఆటోగ్రాఫ్ చేసి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ధోని బీసీసీఐ ఆఫీస్‌లో గడిపిన క్షణాలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.
Discussion about this post