హనుమంతుడు సీతా రాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకుడిగా హిందూమతంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. హనుమాన్, జై భజరంగబలి, మారుతి, అంజనిసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. దేశంలో హనుమంతుని గుడి , లేదా విగ్రహం లేని ఊరు అరుదు.
హిందు మతంలో హనుమంతుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆనాడు హనుమంతుడే లేకుంటే రాముడు రావణుడిని జయించడం కష్టం అయ్యేది. హిందూ ధర్మానికి ప్రతీక హనుమంతుడు. ఆంజనేయ స్వామిని సాక్షాత్తు ఆ పరమశివుని అవతారమని భావిస్తారు. పురాణాల ప్రకారం ఆంజనేయ స్వామి వాయు దేవుడి వరంతో అంజని , కేసరి దంపతులకు జన్మించాడు. జన్మతః బలసంపన్నుడు అయిన ఆంజనేయుడు ఒకసారి ఉదయిస్తున్న సూర్యుని చూచి పండు అనుకొని తింటానికి ఆకాశానికి ఎగిరాడు. అప్పుడు జరిగిన ఘటనలలో ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ బాలుడి దవడ పై కొట్టారు. అలా కొట్టడం వల్ల దవడకు చొట్ట పడినది. చొట్ట పడిన దవడ కలిగిన వాడవడం చేత హనుమంతుడనే పేరు వచ్చింది. తన కొడుకు దెబ్బ తిన్నందుకు ఆగ్రహించి, వాయుదేవుడు వీచటం మానివేశాడు. అపుడు బ్రహ్మాది దేవతలు హనుమంతునకి అనేక వరాలిచ్చి వాయుదేవుని శాంతింపజేశారు.
శ్రీరాముని దేవాలయంలో సీతారాముల ఎదురుగా ముకుళిత హస్తాలతో హనుమంతుడు ప్రతిష్ఠింపబడడం సర్వ సాధారణం. ఇలా రామాలయాలు అన్నీ హనుమంతుని ఆలయాలే అనవచ్చును. ప్రత్యేకంగా హనుమంతుని దేవాలయాలు కూడా చాలా ఉన్నాయి. వీటిలోనూ సీతారాముల పటమో, విగ్రహాలో, ఆలయాలో ఉండడం సాధారణం. పెద్ద ఆలయాలు మాత్రమే కాక చాలా ఊళ్ళలోను, రోడ్లప్రక్కన, చెట్లక్రింద – ఇలా హనుమంతుని చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి. భయాప హారిగా ఆంజనేయుడు పల్లె్ల్లో హిందువులకు వెన్నంటి ఉండే దేవుడు.
లంకలో ఎలాంటి శక్తువంతులున్నారో తెలుసుకొంటే జరగబోయే రామ – రావణ యుద్ధంలో ఉపయోగంగా ఉంటుందని భావించిన ఆంజనేయుడు అక్కడ ఉద్యానవనాలు ధ్వంసంచేయడం ప్రారంభించాడు. అది చూసిన రాక్షస స్త్రీలు రావణుడికి తెలుపగా రావణుడు తనతో బలసమానులైన కింకర గణాన్ని పంపాడు. తనతో పోరాటానికి వచ్చిన జంబుమాలిని, ఏడుగురు మంత్రిపుత్రులు, విరూపాక్షుడు, యూపాక్షుడు మొదలైనవారు యుద్ధానికి రాగా హనుమంతుడు వారిని యమపురికి పంపాడు. అయితే ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి ఆంజనేయుడు వివశుడైనట్టు నటి౦చగా ..రాక్షస వీరులు బంధించి రావణుని వద్దకు తీసుకెళ్ళారు. హనుమంతుడు తాను రామదూతనని సీతను రామునికి అప్పగించకుంటే చావు తప్పదని హెచ్చరిస్తాడు. ఆగ్రహించిన రావణుడు హనుమంతుడిని వంధించమని ఆదేశించగా.. రాయబారిని చంపరాదని మరేదైనా శిక్ష విధించవచ్చని విభీషణుడు వారిస్తాడు. రావణుడు కోతులకు తోక ఎంతో ప్రీతి కనుక అ తోకకు నిప్పంటించమనగా లంకా నగరాన్ని అగ్నికి ఆహుతి చేసి సీతకు నమస్కరించి వానరులతో కూడి రాముడిని చేరి సీతను చూశానని చెప్పాడు.
రాముడు వానరులతో కడలిపై సేతువు నిర్మించి చేసిన రామ రావణ యుద్ధంలో హనుమంతుడు గొప్ప పాత్ర పోషించాడు. లక్షల మంది దానవులను సంహరించడమేగాక లక్ష్మణుడు మూర్చపోగా సంజీవనీ పర్వతం తెచ్చి రక్షించాడు. రావణుడి మరణం తరువాత అయోధ్యకు వెళ్ళి భరతుడికి రాముని రాక గురించి చెప్పి.. స్వాగత కార్యక్రమాలు నిర్వహింప చేసింది హనుమంతుడే!.. రాముడు కూడా తన సోదరులపై కంటే ఎక్కువ ప్రేమను హనుమంతుడిపై చూపి.. చిరంజీవిత్వాన్ని, రాబోయే కల్పంలో బ్రహ్మ పదవిని కూడా ప్రసాదించాడు. హనుమంతుడి జీవనం మనకందరకూ ఆదర్శవంతమైంది.
సంప్రదాయానుసారముగా శ్రీసీతారామ స్తుతి హనుమంతునకు అత్యంత ప్రీతికరమైనది. “యత్ర యత్ర రఘునాథ కీర్తనం, తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్”. అని చదువుతారు. అయితే రక్షణకు, విజయానికి, గ్రహదోష నివారణకు, ఆరోగ్యానికి, మృత్యుభయ విముక్తికి ఆంజనేయుని స్తుతించడం సర్వ సాధారణం. హనుమంతుని ప్రార్థనలలో ప్రసిద్ధమైనది.. “శ్రీ ఆంజనేయం.. ప్రన్నాంజనేయం.. ప్రబాధివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం ….” అని సాగే ఈఆంజనేయ దండకం తెలుగునాట బాగా ప్రసిద్ధమైనది. ముఖ్యంగా పల్లెటూళ్ళలో రాత్రుళ్ళు ఒంటరిగా వెళ్ళేవారు భయ విముక్తికి ఈ దండకం చదువుకుంటారు.
గోస్వామి తులసీదాసు రచించిన హనుమాన్ చాలీసా భారతదేశమంతటా ప్రసిద్ధమైన ప్రార్థన. సుందరకాండ పారాయణ కూడా హనుమదారాధనే అంటారు. విభీషణుడు చెప్పిన ఆపదుద్ధారక ఆంజనేయ స్తోత్రాలు అతి ముఖ్యమైనవి.
Discussion about this post